భద్రాచలం, ఏప్రిల్ 20 : సంక్షేమ, స్వయం ఉపాధి పథకాల కోసం అర్జీలు పెట్టుకునే వారిలో అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు.
గిరిజనులు సమర్పించిన అర్జీలలో పోడు భూములు, వ్యక్తిగత, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాల కొరకు, పట్టా భూములకు రైతుబంధు రుణాల కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం తదితర అంశాలపై దరఖాస్తు చేసుకున్నట్లు పీవో తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఎస్డీసీ ఆనంద్‌కుమార్, మిషన్ భగీరథ ఏఈ నారాయణరావు, ఎల్టీఆర్ డీటీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.