ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జూన్ 25 : గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా రైతులందరికీ పంటల పెట్టుబడి సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారు. అలాగే షరతులు, నిబంధనలు లేకుండా పాత పద్ధతి ప్రకారం రైతులందరికీ రైతు భరోసా ఇస్తేనే బాగుంటుందని తమ ఆలోచనను వ్యక్తం చేశారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా పథకం అమలు కోసం రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఎంపిక చేసిన రైతు వేదికల ద్వారా ఆయా రైతులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతుల నుంచి రాతపూర్వకంగా కూడా సూచనలు స్వీకరించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రైతు వేదిక చొప్పున భద్రాద్రి జిల్లాలో లక్ష్మీదేవిపల్లి, కోయగూడెం, ములకలపల్లి, బూర్గంపహాడ్, చర్ల రైతు వేదికల ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 434 మంది రైతులు తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తొలుత మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతు భరోసా విధివిధానాల కోసం రైతులందరూ తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని కోరారు.
అనంతరం ఆయా రైతులు స్పందిస్తూ.. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకూ పంటల సాయం అందించి లబ్ధి చేకూర్చాలని కోరారు. రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలూ లేకుండా రైతులందరికీ రైతుబంధు సాయాన్ని అందించిందని, ఏ సీజన్‌కు ఆ సీజన్లో పంటల సాగుకు ముందుగానే ఠంచనుగా రైతుబంధు సాయాన్ని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇలాగే ఇవ్వాలని కోరారు. అయితే వానకాలం సాగు ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ సీజన్‌కు సంబంధించిన రూ.15 వేల రైతు భరోసా కొత్త ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదని పలుచోట్ల రైతులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పంటల పెట్టుబడిని సకాలంలో అందించని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో కోతల పేరుతో ఇబ్బందులు పెడితే అన్నదాతల పరిస్థితి మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసానే కాకుండా కనీసం కర్షకుల సహకార సొసైటీల నుంచి సకాలంలో విత్తనాలనూ అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొలకరిలోనే పంటల సాయం అందేదని, వాటితో ఈ సమయానికి తాము సాగు పనుల్లో తీరికలేకుండా ఉండేవాళ్లమని అన్నారు. కానీ.. ఈ ప్రభుత్వం ఇంకా రైతు భరోసా గురించి స్పష్టత ఇవ్వడం లేదని, కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదని ఆరోపించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఆ పద్ధతిలో ప్రతి రైతుకూ రైతు భరోసా ఇస్తేనే బాగుంటుందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. అయితే, ఐదెకరాల్లోపున్న రైతుల వరకూ ఇవ్వాలని కొందరు రైతులు, పదెకరాల్లోపున్న రైతుల వరకూ ఇవ్వాలని మరికొందరు రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు రైతులైతే.. పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీలతో సంబంధం లేకుండా భూమి సాగు చేస్తున్న రైతులందరూ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని కోరారు.
పంట పండించే రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలి. రాష్ట్రంలో భూములు ఉన్నప్పటికీ పక్క రాష్ర్టాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా నిలిపివేయాలి. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మాత్రమే రైతుభరోసా అమలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఇలాంటి భూములను గుర్తించి భరోసా ప్రతిఒక్కరికీ అందేలా చూడాలి.
రైతు భరోసాను ప్రతిరైతుకు ఇవ్వాలి. రైతులను ప్రోత్సహించే విధంగా వ్యవసాయానికి సాయం అందించాలి. సాగు చేసే రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలి. రైతుభరోసా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పన్నులు చెల్లిస్తున్న వారితో పాటు, వ్యాపారస్తులను గుర్తించి పంటల సాగుదారులకు మాత్రమే రైతు భరోసా కల్పించాలి.