మధిర, జులై 03 : అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం సాధారణ ప్రజలకు మరో చట్టమా అని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అధికారులపై మండిపడ్డారు. గురువారం ఎండీఓ కార్యాలయం, ఆర్ అండ్ బి కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేసి ధర్నా నిర్వహించారు. మధిర మండలంలోని తొండల గోపావరం గ్రామ పంచాయతీ పరిధిలోని తొర్లపాడు గ్రామంలో రోడ్డు ప్రక్కన నిర్మించిన ఇల్లు ఆర్ అండ్ బీ అధికారుల ఆదేశాలతో తొలగించడంపై గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరు ఉపయోగించి ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. తొండల గోపారం గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్ అండ్ బి స్థలం ఆక్రమణకు గురైతే తప్పకుండా వెలికి తీయాలని, ఆ విషయంలో అన్ని రాజకీయ పార్టీల పట్ల అధికారులు సమాన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ ఒక్కరికి నోటీసులు ఇవ్వకుండా కేవలం సీపీఎం పార్టీ కార్యకర్త మద్దాల ఏబుకు మాత్రమే నోటీసు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు?. గ్రామంలో అన్యాక్రాంతమైన దళితుల ఇళ్ల స్థలాలు సర్వే నంబర్ 17 నందు వెంటనే హద్దులు ఏర్పాటు చేయాలని, ఆ స్థలాలను ఇంటి స్థలం లేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మధిర మండల కార్యదర్శి మందా సైదులు, జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, డివిజన్ నాయకులు పాపినేని రామనరసయ్య, ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్, మధిర పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, నాయకులు నాయుడు శ్రీరాములు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.