మధిర, ఆగస్టు 20 : అర్హులను గాలికి వదిలేసి అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా అని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో కాటబత్తి వీరబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన దేవసాని వీరకృష్ణ సంతాప సభలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నిరుపేదలెవరో, భూస్వాములు ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. పాతర్లపాడు, నాగులవంచ గ్రామంలో 10 ఎకరాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి నిరుపేదలకు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు అధికారం తమ చేతుల్లో కీలుబొమ్మలాగా చక్రం తిప్పుతున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్న వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావు, రాష్ట్ర నాయకులు మునుకుంట్ల సుబ్బారావు, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, సిపిఎం మండల కార్యదర్శి రాచబంటి రాము, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాములు, రౌతు అప్పారావు, ఆలస్యం రవి, తోటకూర వెంకట నరసయ్య, దొడ్డ చందర్రావు, బీఆర్ఎస్ నాయకుడు సామినేని అప్పారావు, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి తాళ్లూరు యాదగిరి పాల్గొన్నారు.