కూసుమంచి, మార్చి 13 : యాసంగి పంటలకు ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్ను గురువారం తనిఖీ చేసిన కలెక్టర్ నాలుగు శాఖల అధికారులతో మాట్లాడారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, భక్త రామదాసు, పాలేరు పాత కాల్వ, మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు.
తహసీల్దార్ కరుణశ్రీ, డీఈ మధు, రత్నకుమారి, ఏడీఏ సరిత, ఏవో వాణిలతో మాట్లాడుతూ నీటి విషయంలో రోజువారీ పర్యవేక్షణ ఉండాలన్నారు. పాలేరు ఆయకట్టు పరిధిలో ఎక్కడైన నీటి సమస్య ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. రూరల్ మండలం మంగళగూడెంలో నీటి సమస్య ఉందని, దానిని పరిష్కరిస్తామని ఏడీఏ సరిత తెలిపారు. భక్త రామదాసు కాల్వ నీటిని ఎవరూ మళ్లించకుండా అధికారులు, లష్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలతో నిత్యం పరిశీలించాలన్నారు.
యాసంగితోపాటు మళ్లీ వానకాలం పంటలు, నీటి పరిశీలన కోసం గ్రామాల్లో కార్యదర్శి, వీఆర్ఏ, లష్కర్లతో గ్రామ కమిటీలు, తహసీల్దార్, వ్యవసాయాధికారి, ఎస్సై, డీఈలతో మండల కమిటీలు, ఏడీఏ, ఈఈ, ఏసీపీలతో డివిజన్ కమిటీలు వేయాలని, ప్రతీ సోమవారం సమీక్ష జరగాలని కలెక్టర్ ఆదేశించారు. సాంకేతిక సమస్యలతో ఎక్కడైనా నీరు రాకుండా ఉందా? షట్టర్లు ఎక్కడైనా స్ట్రక్ అయ్యాయా? ప్రస్తుతం నీరు లేక ఎండుతున్న పంటలు ఉన్నాయా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాలేరు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో మధ్య వ్యత్యాసం 1,800 క్యూసెక్కులు ఉండడంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఎగువన సాగర్ మొదటి జోన్లో మరమ్మతు పనులు జరుగుతున్నందున తక్కువగా నీరు వస్తుందని, మరో నాలుగు రోజుల్లో 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. అలాగే నీటి నిల్వలు పెంచడానికి పొలాలు, చేలలో ఫాం పాండ్స్, వర్షపు నీటిని ఒడిసిపట్టేలా రైతులను ప్రోత్సహిస్తే బావులు, బోర్లలో నీటి సామర్థ్యం పెరుగుతుందని కలెక్టర్ సూచించారు.