– రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళన తప్పదు
– బీఆర్ఎస్ నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు హెచ్చరిక
వైరా టౌన్, జూలై 18 : వైరా ఆయకట్టు పరిధిలో అధిక శాతం వరి పంట సాగే కావునా రైతులకు సకాలంలో సాగునీరు అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైరా రిజర్వాయర్ పరిధిలో సుమారు 17,500 హెక్టార్ల సాగు భూమిలో రైతులు వరి పంటకే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ వరి సాగుకు సాగునీరు అందిస్తామని సాగునీటిని విడుదల చేసినప్పటికీ, అధికారులు సాగునీరు అందించలేమని ఆరుతడి పంటలు వేసుకోవాలని గ్రామాల్లో గ్రామసభల ద్వారా తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గోదావరి జలాల ద్వారా వైరా రిజర్వాయర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసిన తర్వాత ఎల్ నినో ప్రభావం వల్ల ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించడం బాధాకరమన్నారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వైరా రిజర్వాయర్ నీటిమట్టం ప్రస్తుతం 15.5 అడుగులు ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ 12 అడుగుల నీటిమట్టం ఉన్నా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారులు వరి సాగుకు నీరు అందించలేమని, ఆరుతడి పంటలను పండించడానికి రైతులు సిద్ధం కావాలని కోరడం ఈ ప్రాంత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
తక్షణమే వరికి సాగు నీరు అందించి వైరా ఆయకట్టు పరిధిలోని రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రం పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తీసుకువెళ్లి పంటలను సాగు చేస్తుంటే వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలు వచ్చినప్పటికీ సాగునీరు అందించలేమని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మాదినేని సునీత ప్రసాద్, చిలక చిన్న కోటయ్య, దొంతబోయిన వెంకటేశ్వర్లు, పాసంగులపాటి శివ, నూకల ప్రసాద్ రావు, కొల్లా రాంబాబు, మిట్టపల్లి కిరణ్, వజనేపల్లి చక్రవర్తి, కారుకొండ బోస్, వేముల శివకృష్ణ పాల్గొన్నారు.