బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ‘సీతారామ’ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చే సీజన్ నాటికి అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వపు మాటగా ప్రకటించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు లక్ష్యాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. ఆగమేఘాల మీద ప్రత్యేక కాలువను నిర్మించి ఖమ్మం జిల్లాకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నది.
దీంతో మొదట తమ జిల్లాకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి భద్రాద్రి జిల్లాకు వచ్చే వానకాలంలోగా నీరందిస్తామని హామీ ఇచ్చింది. అయితే నీళ్లు ఇచ్చేవరకు పోరాటాలు ఆపేదిలేదని బీఆర్ఎస్ నాయకులు గర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాడు ‘సీతారామ’ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించగా.. నేడు ఖమ్మం సాగర్ కాలువలకు సైతం ఈ నీరే దిక్కు కావడం గమనార్హం.
– భద్రాద్రి కొత్తగూడెం, జూలై 12 (నమస్తే తెలంగాణ)
నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు వ్యతిరేకించిన ‘సీతారామ’ ప్రాజెక్టు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అదే దిక్కయింది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు సాగునీరు భద్రాద్రి జిల్లాకు ఉపయోగపడే వరకు పోరాటం చేస్తామని పెద్ద ఎత్తున ఇటీవల బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. దీనికి స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు వచ్చే సీజన్ కల్లా సాగునీరు ఇస్తామని కొత్తగూడెం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటగా చెప్తున్నట్లు ప్రకటించారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ చేసిన ధర్నా, పిండ ప్రధాన కార్యక్రమం ఫలితంతో జిల్లాలో ముందుగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పనులు చేసేందుకు అధికారులను ఆదేశించారు. నాడు కాదన్న వారే నేడు కేసీఆర్ కట్టించిన సీతారామే దిక్కయినట్లు జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
సాగర్ కాలువల్లోకి సీతారామ నీరే దిక్కు
భద్రాద్రి జిల్లా నుంచి పాలేరు వరకు వెళ్లాల్సిన సీతారామ సాగునీరును సాగర్‌కు తరలించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లింక్ కెనాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే వంకతో వైరా నియోజకవర్గంలో ఉన్న సాగర్ కాలువకు నీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. భద్రాద్రి జిల్లాకు నీరు లేకుండా ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇచ్చే ప్లాన్‌ను తిప్పికొట్టడంతో బీఆర్ఎస్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. ముందుగా భూసేకరణ చేసి కాలువ పనులు చేసేందుకు సర్కారు హామీ ఇవ్వడంతోపాటు మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. దీంతో ఇక్కడ రైతులు సంబరపడుతున్నా.. చేసేవరకు కాంగ్రెస్ సర్కారును నమ్మే పనిలేదని అంటున్నారు. కాలువ పనులు చేసేవరకు పోరాటాలు చేస్తూనే ఉండాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నది.
ఉమ్మడి జిల్లా కల సీతారామతో సాకారం
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు వరంకాబోతుంది. రెండు జిల్లాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్ చేసినా కాంగ్రెస్ సర్కారు కేవలం ఖమ్మానికే నీరు ఇవ్వాలని కుఠిల రాజకీయాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. చలో పూసుగూడెం పేరుతో గత పదిరోజుల క్రితం పెద్దఎత్తున జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగితే పోలీసులు నాయకుల్ని అరెస్టు చేసి కార్యక్రమాన్ని విఫలం చేశారు. అయినా పోరాటం ఆగదని ప్రకటన చేయడంతో కాంగ్రెస్ జిల్లా రైతులకు వచ్చే సీజన్ కల్లా సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చింది. నాడు కేసీఆర్ కట్టించిన సీతారామతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కాబోతుందని రైతులు సంబురపడుతున్నారు.
‘సీతారామ’ జలాలు విడుదల
అశ్వాపురం, జూలై 12 : అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్ నుంచి శనివారం నీటిని విడుదల చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి పూజలు చేసిన అనంతరం పంపుహౌస్ మొదటి మోటర్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతానికి గోదావరిలో 8.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రతిరోజూ 1,500 క్యూసెక్కుల నీటిని పంటల సాగుకు వినియోగించుకునేందుకు మొదటి పంపుహౌస్ నుంచి నీటిని విడుదల చేశారు.
శనివారం నీటిని విడుదల చేయడంతో నాలుగు రోజుల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద గల ఎన్నెస్పీ లింకు కెనాల్‌కు ఆ నీరు చేరుకుంటుంది. ఆ నీటిని వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని రైతులు 60 వేల ఎకరాలకు పారించుకునే అవకాశం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలకు త్వరలోనే ప్యాకేజీ పనులు పూర్తిచేసి సాగునీరు అందించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు ఎస్ఈలు రవికుమార్, శ్రీనివాసరెడ్డి, ఈఈ తెల్లం వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ మణిధర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.