భద్రాచలం, జూలై 8 : ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామస్తులు మంగళవారం కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ దాడిలో మహిళా అధికారి అయిన ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న కొందరు అధికారులు ఆమెను ఓ వాహనంలో భద్రాచలంలోని ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు.
అయితే, ఈ పెనుగులాటలో మరికొందరు సిబ్బంది కూడా కిందపడిపోయారు. ఈ ఘర్షణలో ‘మా ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే హక్కు తెలంగాణ అధికారులకు లేదు’ అంటూ ఆ గ్రామస్తులు తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం. దేవస్థాన భూముల్లో ఆక్రమణదారులు సోమవారం నిర్మాణాలు చేపట్టారు. రామాలయ అధికారులు మంగళవారం వెళ్లి వాటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు.. అధికారులపై దాడి చేశారు.
భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములన్నీ పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలంలోని ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామాల్లో (విలీన గ్రామాలు) ఉన్నాయి. ఆ భూముల్లోని కొంతభాగంలో సాగవుతున్న కూరగాయల వంటివి నిత్యం దేవస్థానానికి వస్తుంటాయి. మిగితా కొంత భాగం నుంచి దేవస్థానానికి ఆదాయం వస్తుంటుంది. అయితే, పురుషోత్తపట్నంలోని రాములోని భూములను ఆ గ్రామస్తులు చాలా ఏళ్లుగా ఆక్రమిస్తూ, భవనాలు నిర్మిస్తూ వస్తున్నారు.
ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రతిసారీ దేవస్థానం అధికారులు వెళ్లి అడ్డగించడం, వీరిని ఆక్రమణదారులు ప్రతిఘటించడం, అధికారులు వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు ఆక్రమణదారులను నిలువరించడం, నిర్మాణాలు చేపట్టవద్దంటూ సముదాయించడం, తాత్కాలికంగా సద్దుమణిగేలా చూడడం వంటివి జరుగుతున్నాయి. ఆ తరువాత కొన్నాళ్లకు పురుషోత్తపట్నం వాసులు మళ్లీ ఆక్రమణలకు దిగడం, నిర్మాణం చేపట్టడం, రామాలయ అధికారులు వెళ్లి అడ్డగించడం, వీరిపై ఆ గ్రామ ప్రజలు దాడి చేయడం వంటివి నిత్యకృత్యమవుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం కూడా పురుషోత్తపట్నం గ్రామస్తులు.. దేవస్థానం భూముల్లో మళ్లీ పక్కా భవనాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో మంగళవారం దేవస్థాన ఈవో సహా 30 మంది సిబ్బంది వెళ్లి నిర్మాణాలను అడ్డుకున్నారు. ఆక్రమణలను తక్షణమే తొలగించాలంటూ కోరారు. ‘తొలగించేందేలేదు’ అంటూ గ్రామస్తులు సమాధానమిచ్చారు. ‘అయినా, మా రాష్ట్రంలోకి రావడానికి తెలంగాణ అధికారులకు హక్కు ఎక్కడిది?’ అంటూ వాదనకు దిగారు. ‘మా దేవస్థానం భూముల్లో ఆక్రమణలు చేపట్టేందుకు మీరెవరు’ అంటూ దేవస్థానం అధికారులు ప్రతివాదనకు దిగారు.
ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం పెరగడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే ఏపీలోని ఎటపాక రెవెన్యూ, పోలీసులు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ‘ఏదైనా ఉన్నతాధికారుల సమక్షంలో చర్చిద్దాం.. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ దేవస్థానం అధికారులకు సూచించారు. ఇందుకు దేవస్థానం అధికారులు అంగీకరించలేదు. దీంతో గ్రామస్తులు కొందరు కర్రలతో దాడులు చేస్తామని హెచ్చరిస్తూ అధికారులకు మీదకు వచ్చారు. అధికారులు వారిని ప్రతిఘటించడంతో మరికొందరు గ్రామస్తులు ఏకంగా కర్రలు, చీపుర్లతో దాడి చేశారు. దీంతో అక్కడ భయానక వాతావరణంలో నెలకొంది. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు ఉద్యోగులకు కూడా స్వల్పగాయాలయ్యాయి.
రామాలయ భూముల్లోని ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, ఆ భూములకు దేవస్థానం అధికారులకు అప్పగించాలని ఏపీ హైకోర్టు రెండేళ్ల క్రితమే తుది తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పుపై పురుషోత్తపట్నం వాసులు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లారు. ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. అయినా పురుషోత్తపట్నం వాసులు ఆ భూముల్ని ఆక్రమిస్తూనే ఉన్నారు. ఆలయ సిబ్బందిపై దాడులు చేస్తూనే ఉన్నారు.
ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఈవో రమాదేవిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన పూర్వపరాలను మంత్రికి ఈవో వివరించారు. కాగా, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాలయాల ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోబోమని, దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
భద్రాద్రి ఆలయ ఈవోపై జరిగిన దాడిని యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులు ఖండించారు. ఈ మేరకు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆయా ఆలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.