– లెక్చరర్ వేధింపులే కారణమని ఆరోపణ
కారేపల్లి, నవంబర్ 24 : ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అధ్యాపకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి, అతడి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు. కామేపల్లి మండలం పాత లింగాల గ్రామానికి చెందిన విద్యార్థి కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రిందట ఎకనామిక్స్ అధ్యాపకుడు విద్యార్థులను సాయంత్రం 5 గంటల వరకు స్టడీ అవర్లో ఉంచాడు.
అయితే పాత లింగాల గ్రామానికి చెందిన విద్యార్థి తమ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం సక్రమంగా లేదని సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో ఉండటం వల్ల ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని ఎకనామిక్స్ అధ్యాపకుడికి కొంచెం ముందు పంపాలని అభ్యర్థించాడు. దీంతో ఆంగ్ల అధ్యాపకుడు కలుగజేసుకుని ఆ విద్యార్థి పట్ల తోటి విద్యార్థుల ముందు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి ఇంటికి వెళ్లే సమయంలో లారీ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న అతడి సోదరుడు, ఇతరులు అప్రమత్తమై కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది.
ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయగా పై అధికారుల ఆదేశాలతో మెమో కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆంగ్ల అధ్యాపకుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు జరిగిన విషయంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.