ఖమ్మం రూరల్, మార్చి 22 : ఖమ్మం రూరల్ మండలంలోని మంగళగూడెం గ్రామంలో యాసంగి సీజన్లో రైతులు సాగుచేసిన వరి పంట పొలాలను శనివారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. సాగునీరు సరిపడ లేక నెర్రెలు పారుతున్న పంట పొలాలకు సంబంధించి శనివారం నమస్తే తెలంగాణలో యాసంగి ఆశలు ఆవిరి అనే కథనం ప్రచురితమైన సంగతి తెలిసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూరల్ మండల వ్యవసాయ శాఖ అధికారి ఉమా నగేశ్, కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య క్షేత్రస్థాయి పర్యటన చేసి పంట పొలాలను పరిశీలించారు.
రైతులతో డీఏఓ ముఖాముఖిగా మాట్లాడారు. సాగు విస్తీర్ణం, సాగునీటి లభ్యత, తదితర విషయాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని, ఊహించని విధంగా నీటి ఎద్దడి ఏర్పడిందని వాపోయారు. మరో వారం పది రోజులు దాటితే గ్రామ పొలిమేరలో ఎక్కడా నీరు దొరికే అవకాశం లేదన్నారు. పశువులకు సైతం తాగునీటి మబ్బు పొంచి ఉందని తెలిపారు. ప్రస్తుతం పంటలు బయటపడాలంటే ఎన్నారం చెరువు నుంచి తూము వదులుడే మార్గం అన్నారు.
రైతులు ఇచ్చిన సమాచారం అనుగుణంగా అధికారులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఎన్నారం గ్రామ చెరువును సందర్శించి చెరువులో నీటి నిల్వలను పరిశీలించారు. రైతుల పరిస్థితి, నీటి ఎద్దడి తదితర అంశాలను జిల్లా అధికారులకు ఫోన్లో వివరించారు. అదేవిధంగా డీఏఓ మాట్లాడి నీటి విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఓతో పాటు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Mangalagudem : మంగళగూడెంలో ఎండిన పంట పొలాల పరిశీలన