ఖమ్మం, మార్చి 18 : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో వివిధ రకాల పన్నుల వసూలు విషయం వివాదాలకు, వాగ్వాదాలకు దారితీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారంతా కలిసి కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెడుతున్నారు. చివరికి ఆ లక్ష్యాలను చేరలేకపోతే వేతనాలు కూడా కట్ చేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో పన్నుల వసూళ్లకు వెళ్లే క్షేత్రస్థాయి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పన్నులు చెల్లించకపోతే తామెలా బాధ్యులమవుతామని, ప్రజల నుంచి పన్నులను తామెలా బలవంతంగా వసూలు చేయగలమని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజలు పన్నులు చెల్లించని కారణంగా తమ వేతనాల్లో కోత విధిస్తే తమ కుటుంబాలను ఎలా పోషించువాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వేధిస్తే తాము మూకుమ్మడి సెలవు పెట్టి వెళ్లిపోతామని, కూలి పనులైనా చేసుకొని జీవిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 8 గంటలకు కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇదే విషయమై ఏసీతో వాగ్వాదానికి దిగారు.
కేఎంసీలో 60 డివిజన్లు ఉన్నాయి. వీటిల్లోని 80,272 అసెస్మెంట్ల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.36.74 కోట్ల ఇంటి పన్నులను పన్నులు చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం విధించింది. అలాగే 35,648 పంపు కనెక్షన్లకుగాను రూ.16.80 కోట్ల పంపు బిల్లులను వసూలు చేయాలని టార్గెట్ పెట్టింది. ఈ పన్నుల వసూళ్ల కోసం 25 బిల్ కలెక్టర్ల (బీసీ)ను, 18 మంది వార్డు ఆఫీసర్ల (డబ్ల్యూవో)ను కేఎంసీ ఉన్నతాధికారులు నియమించారు. వారికి ఆయా డివిజన్లను కేటాయించారు. అలాగే ఈ పన్నుల విసూళ్ల కోసం నగరంలో 12 చోట్ల ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో సోమవారం (2025 మార్చి 17) నాటికి రూ.36.74 కోట్ల ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యంలో రూ.24.60 కోట్లను వసూలు చేశారు. ఇంకా రూ.12.14 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇక రూ.16.80 కోట్ల పంపు బిల్లులకు గాను సోమవారం నాటికి రూ.6.10 కోట్లను మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.10 .70 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఈ రెండు పన్నులు కలిపి ఇంకా రూ.22.84 కోట్లు వసూలు కావాలి. అయితే, ఈ నెల 31న ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నూరు శాతం పన్నులను వసూలు చేయాలని బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లకు కేఎంసీ ఉన్నతాధికారి టార్గెట్లు విధించారు. కమర్షియల్ ఏరియాల బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు ఒక్కొక్కరూ రోజుకు రూ.2 .50 లక్షలు, నాన్ కమర్షియల్ ఏరియాల బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు ఒక్కొక్కరూ రోజుకు రూ.లక్ష వరకూ వసూలు చేయాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి ఈ లక్ష్యాలను చేరకపోతే వేతనాలు కట్ చేస్తామంటూ హెచ్చరించారు.
ఉదయాన్నే ధర్నా..
టార్గెట్ల పేరితో కేఎంసీ ఉన్నతాధికారి తమను వేధిస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు కలిసి మంగళవారం ఉదయం 8 గంటలకే కేఎంసీలోని కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. పన్నుల వసూలులో తాము అశ్రద్ధ చేయడం లేదని అన్నారు. అయినప్పటికీ రోజుకు రూ.2.50 లక్షలు, రూ.లక్ష చొప్పున టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై అసిస్టెంట్ కమిషనర్ షఫీఉల్లాను చుట్టుముట్టి ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇన్ని టార్గెట్ల మధ్య తాము విధులు నిర్వహించలేమని, మూకుమ్మడిగా సెలవులు పెట్టి వెళ్లిపోతామని స్పష్టం చేశారు. రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ పన్నుల వసూలు కోసం శ్రమిస్తున్నామని; మహిళా ఉద్యోగులు, చిన్న పిల్లలున్న తల్లులు కూడా రాత్రి 9 వరకు పనిచేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ వ్యక్తిగత టార్గెట్లు పెడుతూ వేతనాలు కట్ చేస్తామంటే తాము విధులు నిర్వహించలేమని తేల్చిచెప్పారు.
వంద శాతం పన్నుల వసూళ్ల కోసమే..
కరీంనగర్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లలో ఇంటి పన్నులు, పంపు బిల్లులు కలిపి రోజుకు రూ.50 లక్షల వరకూ వసూలవుతుంటే కేఎంసీలో మాత్రం రోజుకు రూ.20 లక్షలు కూడా వసూలు కావడం లేదు. నూరు శాతం పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే పనిచేయాలని చెప్పాం. మౌఖికంగా ఆదేశించామే తప్ప మరేమీ లేదు. కేఎంసీ బిల్ కలెక్టర్లు కూడా వసూలు చేయగలుగుతారు. పనిచేయాలని చెప్పడం తప్పెలా అవుతుంది? -అభిషేక్ అగస్త్య, కేఎంసీ కమిషనర్