అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేస్తామని ప్రతీ సభలో పదే పదే మంత్రులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ‘అసలైన పేదలకు ఇండ్లు మంజూరు కాకుండా శఠగోపం పెట్టేందుకు ప్రభుత్వమే వివిధ నిబంధనలను సాకుగా చూపుతోందా?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో సర్కారు పెడుతున్న కొర్రీలను చూస్తుంటే ఆ అనుమానాలకు బలం చేకూరుతోంది. దీంతో రేవంత్ సర్కారు తీరుపై నిరుపేదల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వం ఆదేశాలు, ఇటు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల వంటి కారణాలతో సంబంధిత అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.
-అశ్వారావుపేట, మే 15
అమలు సాధ్యంగాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతూ నిరుపేదలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకమే కన్పిస్తోంది. అర్హుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలకు అప్పగించడమే ఇందులో ప్రధానాంశం. కాంగ్రెస్ కార్యకర్తలనే అర్హులుగా చూపుతూ ఇందిరమ్మ కమిటీల బాధ్యులు జాబితాలను రూపొందిస్తుండడంతో అర్హుల ఎంపికలో అధికారుల పాత్ర శూన్యమైంది.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా సాగదీతలే కన్పిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరుతుందనుకొని ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు ఇంకా నిరాశే మిగులుతోంది. మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఈ ఏడాది జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. తరువాత మిగిలిన గ్రామాలకూ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ఎంపికైన వారి జాబితాతో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారు. కానీ.. జాబితా నిండా అనర్హుల పేర్లు, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లే ఉండడంతో నిరుపేదలు నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో సర్వే కూడా సక్రమంగా కొనసాగడం లేదు. తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదంటూ ఇప్పటికీ అన్ని గ్రామాల్లోనూ పేదలందరూ ఆందోళనలో చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ప్రభుత్వం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. వీటిని చూసి పేదలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పేదలకు ఇండ్లు మంజూరు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఇలాంటి కొర్రీలుగా పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అగ్ని ప్రమాదంలో మా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అప్పటి నుంచి పూరి గుడిసె నిర్మించుకొని జీవిస్తున్నాం. అయినా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. మా సమస్యను ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
-కలపాల మరియమ్మ, గుర్రాలచెరువు, అశ్వారావుపేట
ప్రభుత్వ నిబంధనల మేరకే అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతోంది. ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఎంపిక చేసిన వారిలో అనర్హులుంటే విచారణ చేసి తొలగిస్తున్నాం. తర్వాత ఎల్-2 జాబితాలోని అర్హులను తుది జాబితాలో చేర్చుతున్నాం.
-ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, అశ్వారావుపేట