ఖమ్మం, ఏప్రిల్ 5 : సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందోనని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం చూస్తుంటే ఇప్పట్లో ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత గత జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఒకేసారి ఇవ్వకుండా పైలట్ గ్రామాల పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 850 మందికి మాత్రమే మంజూరు చేసింది.
పైలట్ గ్రామాలు తప్ప మిగిలిన 524 పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, ఖమ్మం కార్పొరేషన్లో ఎక్కడా కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. పైగా పదేపదే సర్వేలు చేయడం అలవాటు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మళ్లీ సర్వే చేస్తున్నది. అయితే పైలట్ గ్రామాల్లో సైతం అరకొరగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇంకెన్నాళ్లు ఇళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తుందోనని నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని అధికారంలోకి రాగానే తుంగలోకి తొక్కింది. 15 నెలలు గడిచినా ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు. అర్హుల ఎంపికలో అనేక కొర్రీలు పెడుతున్నది.
ఇప్పటికే పలు దఫాలుగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక మాత్రం చేయలేదు. మండలానికి ఒక్క గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసింది. ఆ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని చెప్పి రాత్రికిరాత్రే దరఖాస్తులు స్వీకరించారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరూ కొండంత ఆశతో ఉండగా అర్హులను మూడు రకాలుగా విభజించారు. వారికి కూడా ఇంతవరకు అతీగతీ లేదు.
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం పదే పదే సర్వేలు చేయిస్తున్నది. ఇప్పటికే మూడు పర్యాయాలు సర్వే చేసినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక మాత్రం పూర్తికాలేదు. జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో తప్ప మిగిలిన ఏ ఒక్క గ్రామంలోనూ, మున్సిపాలిటీలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఇండ్ల మంజూరు కోసం అనేక గ్రామాల్లోని పేదలు ప్రస్తుతం ఉంటున్న ఇండ్లను కూల్చుకొని ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ ఇల్లు మంజూరైతే వెంటనే నిర్మించుకోవాలనే కొండంత ఆశతో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 549 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలు పోను.. మిగిలిన 544 గ్రామ పంచాయతీల్లో ఒక్క లబ్ధిదారుడిని కూడా ఎంపిక చేయలేదు. ఇదిలా ఉండగా.. ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద వార్డులను ఎంపిక చేయలేదు. కాగా.. మున్సిపాలిటీల్లో ఇప్పటికే పలు దఫాలుగా దరఖాస్తులు స్వీకరించారు. మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించి అర్హతలనుబట్టి ఎల్-1, ఎల్-2, ఎల్-3 విభాగాలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం జిల్లాలోని అన్ని గ్రామ, డివిజన్, వార్డుల సభల్లో అర్హుల జాబితాలను ప్రకటించారు. ఆ జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తమకు ఇల్లు మంజూరైందని సంబురపడ్డారు. కానీ.. ప్రభుత్వం రీ సర్వే పేరుతో కాలయాపన చేస్తున్న విషయం తెలుసుకున్న పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్లో 5,754, వైరాలో 2,201, మధిరలో 1,211, సత్తుపల్లిలో 856 మంది లబ్ధిదారులను ఎల్-1 జాబితాలో ఎంపిక చేశారు. వీరిలో కూడా అనర్హులు ఉన్నారనే నెపంతో తిరిగి సర్వే చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 20 గ్రామాల్లో 850 మందిని మాత్రమే ఎంపిక చేశారు. చింతకానిలో రేపల్లెవాడ, ఖమ్మం రూరల్ మండలంలో ఆరెంపుల, కామేపల్లిలో పొన్నెకల్, కొణిజర్లలో చిన్నగోపతి, కల్లూరులో ఈస్ట్ లోకవరం, కూసుమంచిలో ధర్మాతండా, బోనకల్లో గార్లపాడు, తిరుమలాయపాలెంలో ఏలువారిగూడెం, నేలకొండపల్లిలో కొంగర, రఘునాథపాలెంలో మల్లెపల్లి, ముదిగొండలో ఖానాపురం, ఎర్రుపాలెంలో రాజులదేవరపాడు, మధిరలో చిల్కూరు, సత్తుపల్లిలో కొత్తూరు, వైరాలో పుణ్యపురం, తల్లాడలో కొడవిమిట్ట, సింగరేణిలో కొత్తతండా, పెనుబల్లిలో రామచంద్రాపురం, వేంసూరులో చిన్నమల్లెల, ఏన్కూరులో రేపల్లెవాడలను ఎంపిక చేశారు. ఈ మొత్తం గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని చెబుతున్నది. ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు కలిపి 17,500 ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు పైలట్ గ్రామాల కింద ఎంపిక చేసిన 20 గ్రామాల్లో 850 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మొత్తం 17,500 ఇండ్లలో కేవలం 850 మాత్రమే మంజూరు చేయగా.. వాటిలో 51 ఇండ్లకు మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు.
జిల్లాలో అనేక గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిని ఆన్లైన్లో నమోదు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అర్హుల జాబితాను వెల్లడించారు. ఆ జాబితాలో అర్హులకు బదులు అనర్హులకు ఇండ్లు వచ్చాయని జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో అదే గ్రామసభల్లో మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని ఆయా మండల కార్యాలయాల్లో ఆన్లైన్ చేయలేదు. అధికారులను అడిగితే ముందుగా పైలట్ గ్రామాల్లో చేసి తర్వాత మిగతా గ్రామాల్లో చేస్తామని చెబుతున్నారు.
ప్రతి నెల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఎప్పుడు ఇస్తుందోనని వేయి కండ్లతో ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలకు తోడు కొన్ని వేసుకొని ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం. ఇప్పటివరకు ఇండ్లు మంజూరు కాలేదు. మున్సిపాలిటీకి వెళ్లి అధికారులను అడిగితే మా దగ్గర సమాచారం లేదంటున్నారు.
– నిమ్మతోట మౌనిక, 27వ డివిజన్, ఖమ్మం
అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ నాయకులు చెబితే నమ్మి ఓటేశాం. అధికారంలోకి వచ్చి చాలా నెలలు అవుతున్నా ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇంటి కోసమని ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు చేశా. ఇల్లు వస్తుందో.. రాదో కూడా నమ్మకం లేదు.
– చింతమళ్ల కావ్య, 58వ డివిజన్, ఖమ్మం
నేను ఇప్పటివరకు ఆరుసార్లు దరఖాస్తు చేశా. ప్రతిసారీ రూ.200 ఖర్చు. ఇండ్లు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూస్తున్నాం. మళ్లీ సర్వేకు వస్తారని మా డివిజన్లో అంటున్నారు. వాళ్లు వచ్చేటప్పుడు మేము ఇంటివద్దనే ఉండాలి కదా.. ఎప్పుడు వస్తారో తెలియక పనులకు పోలేక ఇబ్బందులు పడుతున్నాం.
– కమ్మం వసంతరావు, 57వ డివిజన్, ఖమ్మం