ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ‘ఇందిరమ్మ ఇళ్ల తీరు ఇంతింత గాదయా..’ అన్నట్లుగా ఉంది రేవంత్‌రెడ్డి సర్కారు తీరు. ‘కుండలో బువ్వ కుండలోనే ఉండాలి. పిల్లలు మాత్రం పుష్టిగా కన్పించాలి’ అనే నానుడిలా తయారైంది ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ తీరు. ‘పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లుగానే ఉండాలి. ప్రభుత్వానికి ఖర్చు పెరగొద్దు. ఒకవేళ వ్యయం పెరిగితే లబ్ధిదారుడు ఆ ఇంటి నిర్మాణాన్ని మధ్యలో వదిలేయొద్దు. ఒకవేళ అలా వదిలేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది కాబట్టి నా నింద మోయొద్దు. కానీ ఇందిరమ్మ ఇళ్లు అందరికీ అందినట్లు ప్రచారం జరగాలి.’ అనే సంక్లిష్టతల నుంచి బయటపడేందుకు అనేకానేక గిమ్మిక్కులు ఆలోచించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
చివరికి లబ్ధిదారులను ఏమార్చేందుకు నాలుగు నమూనాలను తీసుకొచ్చింది. ఇందులో మొదటగానే ‘ఇంటి నిర్మాణం కచ్చితంగా 400 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల వరకూ ఉండాలి’ అనే నిబంధన పెట్టింది. ఇక పిల్లర్లు, భీమ్‌లు వంటివి లేకుండా కొన్ని నమూనాలను; ఐరన్, సిమెంట్, కూలీల ఖర్చులు భారీగా తగ్గించేలా మరికొన్ని నమూనాలను రూపొందించింది. ఈ నమూనా ఇళ్లను మండలానికి ఒకటి చొప్పున నిర్మిస్తోంది. నాణ్యత సంగతి ఎలా ఉన్నా ఈ నాలుగు నమూనాల ప్రకారమే ఇళ్లు నిర్మించుకునే ప్లాన్ చేసింది. పైకి మాత్రం ‘లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవచ్చు’ అనే కలరింగ్ ఇస్తుండడం గమనార్హం.
-అశ్వారావుపేట, ఫిబ్రవరి 23
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం డోలాయమనంలో పడింది. మార్కెట్లో ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో వాటిని తప్పించుకునేందుకు అనేక కుటిల ఆలోచనలు చేస్తోంది. నిర్మాణ ఖర్చు తగ్గించేలా నాలుగు మోడల్స్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం కసరత్తు చేపట్టింది. ఐరన్, సిమెంట్ ఖర్చు తగ్గించేలా నమూనాలను రూపొందిస్తోంది. లబ్ధిదారుడు ఈ నాలుగు నమూనాల్లోనే ఏదైనా ఒకదానిని ఎంచుకునే పరిస్థితిని తెప్పించింది.
ఖర్చు పెరిగి ఇంటి నిర్మాణం మధ్యలో నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే దురాలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది. పైకిమాత్రం లబ్ధిదారుడు తన స్వేచ్ఛ ప్రకారం ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవచ్చని బుకాయిస్తూనే ఆఖరికి ఈ నాలుగు నమూనాల చట్రంలోకి ఇరికించేలా ప్లాన్ చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఇంటి నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఐరన్, సిమెంట్, కూలీల ఖర్చు భారీగా పెరిగిపోయింది.
ఈ దశలో ‘ఒక నమూనా ఇచ్చి ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు ఇస్తే నిధులు సరిపోతాయా? అదనంగా లబ్ధిదారులు వెచ్చించగలడా? ఒకవేళ రూ.5 లక్షలు సరిపోకపోతే లబ్ధిదారుడు ఈ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేస్తే ఎలా?’ అనే సందేహాల నేపథ్యంలో నాలుగు నమూనాలను తెరమీదకు తీసుకొచ్చింది. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో లబ్ధిదారులు అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇంటి పనులు మొదలు పెట్టి నిధులు చాలక మధ్యలోనే ఆపేస్తే ప్రభుత్వం చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తుందనే అనుమానాలతోనే రేవంత్‌రెడ్డి సర్కారు ఇలాంటి ఆలోచనలు చేస్తోంది
అలాగే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు మండలాని ఒక మోడల్ ఇంటి నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి వివిధ శాఖ కార్యాలయాల ప్రాంగణంలో ఈ నమూనా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం నిర్మిస్తున్న పిల్లర్లు, భీమ్‌లతో కూడిన పద్ధతిలో కాకుండా ఖర్చు తక్కువ అయ్యేలా ఇతర పద్ధతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండలానికి ఒకటి చొప్పున వేర్వేరు పద్ధతుల్లో మోడల్ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది. వీలైన ఎక్కువ మంది మేస్త్రీలకు ఆయా పద్ధతుల నిర్మాణాలపై అవగాహన కల్పించేలా ఒక ప్రైవేట్ కంపెనీ నేతృత్వంలో మరికొద్ది రోజుల్లో శిక్షణ కూడా ఇవ్వనుంది.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే విధంగా ప్రభుత్వం పలు పద్ధతులపై అధికారులతో సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా నాలుగు పద్ధతులను ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. వీటిలో ఏదో ఒక నమూనా ప్రకారం లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.
ఈ పద్ధతిలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్‌తో సిద్ధం చేస్తారు. పునాదులపై రంద్రాన్ని డ్రిల్ చేసి ర్యాడ్స్తో ఆ గోడలను అనుసంధానం చేస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్ వ్యయం ఉండదు.
గోడలపై ఆర్సీసీ రాఫ్టర్లు అమర్చుతారు. వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగళూరు ఎంకులు పరుస్తారు. పెంకుల మీద రెండున్నర అంగుళాల మందంతో శ్లాబ్ వేస్తారు. ఈ విధానంతో ఇటుక, స్టీల్ వ్యయం తగ్గించొచ్చు.
ఇళ్ల నిర్మాణంలో ఐరన్ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చును తగ్గించేందుకు ఈ డిజైన్ పద్ధతి ఒకటి. పునాది నిర్మాణం వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి. పైన ప్లింథ్ భీమ్స్ ఉంటాయి. మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లలో పైఅంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
కాంక్రీట్ గోడలు నిర్మించిన తర్వాత.. పూర్వకాలపు దూలాల తరహా పైన ఆర్సీసీ రాఫ్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించేలా నాలుగు పద్ధతుల్లో నమూనా ఇళ్లు నిర్మిస్తున్నాం. మండలానికో మోడల్ ఇంటి నిర్మాణం చేపట్టాం. లబ్ధిదారులకు నిర్మాణం, వ్యయం తగ్గింపుపై అవగాహన కోసం ఈ మోడల్ ఇళ్లు ఉపయుక్తంగా ఉంటాయి. మొత్తం ఇంటి నిర్మాణం వ్యయం అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. ఏ లబ్ధిదారుడైనా 400 నుంచి 500 చదరపు అడుగుల్లో మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలి. అంతకు మించి విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే అనుమతించం.
-రాము, హౌజింగ్, ఏఈ, అశ్వారావుపేట