ఎదులాపురం, మార్చి 17 : అక్షర చిట్‌ఫండ్ నడుపుతూ వందల సంఖ్యలో బాధితులను మోసం చేసిన ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లో మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన పేరాల శ్రీనివాసరావు అక్షర చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీని ప్రారంభించి, రాష్ట్రంలోని పలుచోట్ల చిట్ సీములు ప్రారంభించాడు. కంపెనీ ఏజెంట్లు వందలాది మందిని చీటీల్లో చేర్పించి, పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించారు.
గడువు తర్వాత డబ్బులు చెల్లించకుండా శ్రీనివాస్‌రావు తప్పించుకు తిరుగుతున్నాడని ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయి. బాధితులు రూ.99 లక్షలు చెల్లించగా.. వారికి సుమారు రూ.1.11 కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉన్నదని ఎస్పీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని, సాంకేతికతతో నిందితుడిని గుర్తించి సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు చెప్పారు. అతడి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఐపాడ్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.