కూసుమంచి, మార్చి 20: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుడు పాలేరు నీటిమట్టం అడుగంటిన నేపథ్యంలో ఈసారి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట కలెక్టర్ ఖాన్ పాలేరుకు వచ్చారు. రిజర్వాయర్ దిగువన పంటల పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇబ్బందులు ఉన్న ఖమ్మం రూరల్, మధిర, బోనకల్లు ప్రాంతాలను పరిశీలించారు.
ఎగువ నుంచి తగినంత రాకపోవడంతో పాలేరుకు నీటి ఇబ్బందులు వస్తున్నాయనే విషయాన్ని గమనించారు. నాగార్జున సాగర్ నుంచి పాలేరు వరకు రావాల్సిన నీటి వాటాపై ఆరా తీశారు. పాలేరు ఎగువన నీరు వృథా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పాలేరుకు సాగర్ నుంచి వచ్చే ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం 5,490 క్యూసెక్కల నీరు వచ్చి చేరుతోంది.
దీంతో దిగువకు 4,606 క్యూసెక్కులను అధికారులు జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు వదులుతున్నారు. పాలేరు నుంచి మూడు జిల్లాలకు తాగునీటి కోసం మిషన్ భగీరథ ద్వారా 135 క్యూసెక్కులను వదులుతున్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 275 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, పాలేరు పాత కాలువ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని వరి, చెరుకు రైతుల కోసం 200 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు.