ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజూ కుండపోత వర్షం కురిసింది. అశ్వారావుపేటలో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో పలుచోట్ల వాగులు పొంగి ప్రవహించాయి. ఫలితంగా ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని మండలాల్లో చెరువులు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు పోశాయి. జలాశయాలు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి.
భారీ వర్షం కారణంగా వరద నీరు పంటల పొలాల్లో నిలిచింది. దీంతో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. పాలేరు జలాశయం సంద్రాన్ని తలపిస్తోంది. వరదంతా గేట్ల మీదుగా ప్రవహిస్తోంది. మున్నేరు, ఆకేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే, మున్నేరు పరీవాహక ప్రజల బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వారంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌లోకి సుమారు 9వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో అధికారులు అదేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 24 అడుగుల మేర ఉంది.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు14
వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో గురువారం కూడా భారీ వర్షం కురిసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులందరూ ఇళ్లలోనే ఉన్నారు. కానీ కుండపోత వర్షం ధాటికి జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేని వర్షంతో ఖమ్మం నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగడంతో రోడ్లపైకి మురుగు చేరింది. అధికారుల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఏకధాటి వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లి – వీఆర్ బంజర ప్రధాన రహదారిపై బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. పలు మండలాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. కాగా, మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
-నమస్తే నెట్వర్క్, ఆగస్టు14
Khammam1
ఉమ్మడి జిల్లా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు చెక్‌డ్యాం పొంగిపొర్లుతోంది. దుమ్ముగూడెం మండలం మారేడుబాక – సింగవరం గ్రామాల మధ్య మొట్లవాగు పొంగి ప్రవహించడంతో దుమ్ముగూడెం, పౌలూరుపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరికల్ల చెరువు మత్తడి పోయడంతో మారాయిగూడెం గ్రామంలో రోడ్డుపైకి నీరు చేరింది. చెరిపల్లి, రామచంద్రునిపేట గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ మండలంలో గడిచిన 24 గంటల్లో 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన లకావత్ సత్యం ఇల్లు గురువారం తెల్లవారుఝామున కుప్పకూలింది.
ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు – బనిగండ్లపాడు మార్గంలో ఉప్పువాగు రోడ్డుపై నుంచి ప్రవహించింది. చుంచుపల్లి మండలంలో పెనగడప పెద్ద చెరువు, ఎర్రచెరువు, కృష్ణారాయుడు చెరువులతపాటు చింతలచెరువు మినీ ట్యాంక్బండ్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. దమ్మపేట ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి అశ్వారావుపేట మండలం నల్లబాడువాగు ఉధృతంగా ప్రవహించి అంకమ్మ చెరువులో కలిసింది. దీంతో ఆ చెరువు ఆలుగు పోస్తోంది. నల్లబాడు వాగు ఉధృత ప్రవాహంతో అశ్వారావుపేట – వాగొడ్డుగూడెం మధ్య రాకపోకలు నిలిచాయి. భద్రాద్రి జిల్లాలోని పలు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.
జిల్లాలో మొత్తం 2,364 చెరువులకు గాను వంద చెరువులు అలుగు పోస్తున్నాయి. 688 చెరువులు వంద శాతం, 675 చెరువులు 80 శాతం, 645 చెరువులు 60 శాతం నిండాయి. సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు మత్తడి దుంకడంతో ఆ చెరువు అందాలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వర్షంలోనూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, బోనకల్లు మండలంలోని కలకోట పెద్దచెరువులో సుమారు 100 టన్నుల చేపలు వరదకు ఎదురెక్కడంతోపాటు అలుగు ద్వారా వెళ్లిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, తల్లాడ మండలంలోని బిల్లుపాడు – రామచంద్రాపురం, గూడూరు – మిట్టపల్లి మధ్య వాగులు పొంగి పొర్లాయి. దీంతో గూడూరు, మువ్వగూడూరు, వెంకటరామునితండా, రామచంద్రాపురం, కొత్తవెంకటాపురం గ్రామాల నుంచి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఐదు గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకోవాలంటే 25 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట డ్రైవర్స్ కాలనీలోకి వరద పోటెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరింది.
సంత మార్కెట్ ప్రాంతం చెరువును తలపించింది. వెంకమ్మ చెరువు అలుగు పారడంతో వాగొడ్డుగూడెం వాగు వంతెన పైనుంచి వదర ప్రవహించింది. దీంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సీతవాగు పొంగడంతో పర్ణశాలలోని సీతమ్మవారి నారచీరల ప్రాంతం నీటమునిగింది. సున్నంబట్టి ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న గుబ్బలమంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.