ఖమ్మం సిటీ, జూన్ 2: ‘తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరారు. పిడికిలి బిగించి కోట్లాది మందిని ఏకంచేశారు. రాజకీయ పదవులను గడ్డిపూసతో సమానంగా భావించారు. చివరికి ప్రాణత్యాగానికి సైతం వెనుకాడలేదు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు.
జాతీయజెండాను అజయ్, గులాబీజెండాను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఆవిర్భావ కేక్ కట్ చేసి పార్టీ నేతలు, ఉద్యమకారులకు తినిపించారు. అనంతరం జరిగిన సమావేశంలో అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ పిడికిలి బిగించి, గులాబీజెండాను భుజానికెత్తుకొని ఉద్యమపథాన దూకారని గుర్తుచేశారు. తెలంగాణ కాంక్షను నెరవేర్చేందుకు ఆనాడు అనేకమార్లు పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లో ఉద్యమకాంక్షను రగిలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచారని జ్ఞప్తికి తెచ్చారు.
ఉమ్మడి ఆంధ్రా పాలకుల నిరంకుశ వైఖరికి ఎదురొడ్డి నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ఆనాటి కాంగ్రెస్ పాలకులు, నీరు గార్చేందుకు సమైక్యవాదులు అనేక కుట్రలకు తెరలేపారని వివరించారు. ఆ నేపథ్యంలో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగి ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారని గుర్తుచేశారు. సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని వివరించారు. కానీ, నేడు తెలంగాణలో నకిలీ కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని అజయ్ ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లుగా అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతులు పండించిన పంటలను కొనలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఖమ్మం జిల్లాకు మహర్దశ..
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందంటే కేవలం తెలంగాణ సిద్ధించిన తర్వాత ఉద్యమనేత కేసీఆర్ అందించిన సహకారంతోనే అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వివరించారు. సభ్యత్వ నమోదు, పార్టీ పదవుల్లో యువత, మహిళలు, ఉద్యమకారులకు అధిక ప్రాధాన్యమివ్వాలని, అవసరమైతే తాను సైతం పక్కకు జరిగేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీజెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వమే స్వరాష్ర్టానికి, ప్రజలకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బానోత్ మనీషా, కర్నాటి కృష్ణ, పగడాల నరేందర్, మక్బుల్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, పసుమర్తి రామ్మోహన్రావు, బుర్రి వెంకట్‌కుమార్, బత్తుల మురళి, మాటేటి నాగేశ్వరరావు, పల్లా రోజ్లీనా, బిక్కసాని ప్రశాంతి జస్వంత్, పగడాల శ్రీవిద్య, వీరూనాయక్, కొల్లు పద్మ, షకీనా, ధనలక్ష్మి, మేకల సుగుణారావు, సతీశ్, వెంకటేశ్వరరావు, సుదర్శన్, వెంకటప్పారావు, రామారావు, ప్రదీప్ పాల్గొన్నారు.