భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : పేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు ఆసుపత్రిలో అదే రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే.. ఇక్కడే ముక్కు పుఠాలం ముక్కలయ్యేంత గబ్బు కొడుతోంది. దీంతో రోగాలను నయం చేయించుందామని వైద్యశాలకు వచ్చిన రోగులు, వారికి తోడుగా వచ్చిన సహాయకులు.. మరికొన్ని రోగాల భారిన పడుతున్నారు. సాక్షాత్తూ భద్రాద్రి జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలోనే ఇంతలా దుర్గంధం వెదజల్లుతూ గబ్బు కొడుతుండడంతో రోగులు, వారి సహాయకులు అడుగడుగునా ముక్కులు మూసుకుంటూ వచ్చిపోతున్నారు.
కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో పర్యవేక్షకులు మారినా ఆసుపత్రి తలరాత మాత్రం మారడం లేదు. కలెక్టర్లు తనిఖీలు చేసినా వైద్యుల పనితీరులో మార్పు రావడం లేదు. ఇప్పటికే మందులు సరిపడా లేక, వైద్యులు తగినంతమంది లేక పేద రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక ఆసుపత్రి ఆవరణ కూడా దుర్గంధం వెదజల్లుతుండడంతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. కాలువల ద్వారా పోవాల్సిన మురుగునీరు ఆసుపత్రి ఆవరణలో నిలిచి ఉంటోంది. తాగునీరు ట్యాంకు పనిచేయడం లేదు. మూత్రశాలలు దుర్గంధం వెదజల్లుతున్నాయి.
సెప్టిక్ ట్యాంకు నుంచి మురుగు నీరు బయటకు..
బెడ్లు పెరిగినా ఆసుపత్రి పరిశుభ్రతలో మాత్రం మార్పు లేదు. నీళ్ల ట్యాంకులో మంచినీళ్లు మచ్చుకైనా లేవు. ఇక మరుగుదొడ్ల నుంచి వచ్చే మురునీరు పోవడానికి దారి కూడా లేదు. దీంతో ఆసుపత్రి ఆవరణ అంతా మురుగు నీరు నిల్వ ఉంటోంది. దీంతో సెప్టిక్ ట్యాంకులు కూడా నిండి పొర్లుతున్నాయి. తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఆసుపత్రి వైద్యులు పట్టించుకున్న పాపానపోవడం లేదని స్థానికులు, రోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొందరు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. అయినా స్పందన రాలేదు.
హెచ్చరికలతోనే సరా..?
అసలే వైద్యులు అంతంత మాత్రం. మందులు కూడా సరిపడా లేవు. ప్రిస్కిప్షన్ తీసుకొని వస్తే సగానికి సగం మందులు బయటే తెచ్చుకోమని సలహా ఇస్తారు. చివరికి శుభ్రతపైనైనా దృష్టిపెడతారా.. అంటే అదీ లేదు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల ఈ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యులు రిజిస్టర్లో సంతకాలు కూడా పెట్టడం లేదని తేలింది. రెండు మూడు గంటలపాటు ఆసుపత్రిని పరిశీలించిన ఆయన.. ఇక్కడి వైద్యుల పనితీరు, అపరిశుభ్రత వంటి అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా పట్టించుకోకపోవడంతో స్వయంగా ఆయనే ఇక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కూడా రెండుసార్లు ఈ ఆసుపత్రిని తనిఖీ చేశారు. మెరుగైన వైద్య సేవలందించకపోతే ఊరుకునేది లేదంటూ వైద్యులపైనా, పర్యవేక్షకులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అంతలా హెచ్చరించినా వారిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. దీంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంలా అయింది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రి పరిస్థితి.
మురుగు నీరు రోజుల తరబడి పారుతోంది..
మరుగుదొడ్లలో ఉండే మురుగంతా బయటకొస్తోంది. అది ఆసుపత్రి ఆవరణలో రోజుల తరబడి పారుతోంది. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్య గురించి కలెక్టర్కు చెప్పాం. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాం. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ ఆసుప్రతిలోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది.
-శ్రావణబోయిన నర్సయ్య, స్థానికుడు