భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలోని పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. తొలిపోరుకు పల్లె పౌరులు సై అంటున్నారు. ఈ నెల 11 జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా కూడా విడుదలైంది. ప్రచారం కూడా ఊపందుకుంది. భద్రాద్రి జిల్లాలో ఈ తొలి విడతలో 159 పంచాయతీలకు గాను 14 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 145 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 461 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో మిగిలారు. ఇక 1,436 వార్డుల్లో 336 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 1,077 వార్డుల్లో 2,567 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తంగా తొలి విడతలో 14 పంచాయతీ స్థానాలు, 336 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
బీఆర్ఎస్లో చేరికల జోష్..
పంచాయతీ ఎన్నికలకు పల్లె జనం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో వరుస చేరికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో గులాబీ శ్రేణుల్లో జోష్ షెరిగింది. ఇల్లెందు నియోజకవర్గంలో ఎన్డీ మాజీ సర్పంచ్ శంకర్ 50 మందితో కలిసి బీఆర్ఎస్లో చేరారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత సత్యనారాయణ కూడా బీఆర్ఎస్లో చేరారు. మణుగూరు ముత్యాలమ్మనగర్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు చాంద్‌పాషా, ఇస్మాయిల్ బీఆర్ఎస్ గూటికి చేరారు. అన్నపురెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కారం శివ; మణుగూరు దమ్మక్కపేట మాజీ సర్పంచ్ మడి గౌతమి సహా 9 మంది మాజీ వార్డు సభ్యులు బీఆర్ఎస్లో చేరిపోయారు. అలాగే.. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని అనంతారం, రెడ్డిగూడెం గ్రామాల నుంచి సుమారు 50 కుటుంబాల వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికలు ఇంకా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
భద్రాచలంలో ‘నువ్వా-నేనా’?
పెద్ద పంచాయతీగా ఉన్న భద్రాచలంలో రాజకీయం మరింత వేడెక్కింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడి బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేకు గుణపాఠం తగిలేలా భద్రాచలం పంచాయతీని గెలుచుకోవాలని పట్టుబట్టారు. ఇందుకోసం సీపీఎం, జీడీపీ, బీఆర్ఎస్ పొత్తు కలిశాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మానె రామకృష్ణ బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించి బీఆర్ఎస్ బలపర్చిన కూటమి అభ్యర్థిగా విజయఢంకా మోగించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. 40 వేలకు పైగా ఉన్న ఓటర్లున్న భద్రాచలంలో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలం పట్టణానికి అభివృద్ధేమీ జరగకపోవడంతో బీఆర్ఎస్ మిత్రపక్షాలు దీనినే ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకొని ఓటర్ల దగ్గరకు వెళ్తున్నాయి.