గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు కూడా బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి సరిహద్దులు దాటించి అక్రమ వ్యాపారం చేసేవారు. ఇప్పడు సన్నబియ్యం ఇస్తుండడంతో వ్యాపారులు మరికొంత ధర చెల్లించి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో 440 షాపుల ద్వారా పేదలకు నెలకు 5000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. ఇటీవల కాలంలో ఒక్కసారిగా బఫర్ స్టాక్ పేరుతో మూడు నెలలకు సరిపడా రేషన్ లబ్ధిదారులకు 17,200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది. దీంతో అక్రమార్కులు మరింత బరితెగించి లారీలకొద్దీ బియ్యాన్ని కొనుగోలు చేసి దొడ్డిదారిన తరలిస్తున్నారు.
దీనికి అధికారుల సహకారం ఉండడంతో దందాకు మరింత బలం చేకూరింది. ఇందుకు ఉదాహరణ.. గత మూడు నెలల క్రితం గోదాములకు రావాల్సిన లారీల బియ్యాన్ని డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండగా అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేయడమే. ఇందులో పౌరసరఫరాల సిబ్బంది కూడా సస్పెన్షన్కు గురయ్యారు. డీలర్లపై కేసులు నమోదు చేసి వారిని తొలగించారు. కానీ, దందా మాత్రం ఆగడం లేదు.
రేషన్ బియ్యం విక్రయాల్లో డీలర్ల పాత్ర ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినా తెరచాటు వ్యవహారం మాత్రం సాగుతూనే ఉంది. అసలైతే డీలర్లు ఉదయం, సాయంత్రం రెండు పూటలూ షాపులు తెరవాలి. కానీ, జనాలు కూలి పనులకు వెళ్తున్నారనే నెపంతో షాపులు తెరవకుండా వారికి వచ్చే బియ్యాన్ని వారే కొనుగోలు చేసి అక్రమానికి తెరలేపుతున్నారు.
సిమ్ సిగ్నల్ ఉండడం లేదని కొందరు, ఫోన్లు పనిచేసినా బియ్యం రాలేదని మరికొంత మంది లబ్ధిదారులను పలుమార్లు తిప్పడంతో వారు విసిగిపోసి మళ్లీ రావడం లేదు. దీంతో ఆ బియ్యాన్ని డీలర్లు తమ వద్దే ఉంచుకొని అక్రమంగా విక్రయించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అక్రమ వ్యాపారులు ఆ బియ్యాన్ని మూటల్లో కట్టి అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో లోడ్ చేసుకొని సరిహద్దులు దాటిస్తున్నారు.
వ్యాపారుల మధ్య తేడాలు వచ్చినప్పుడు మాత్రం బయటకు సమాచారం ఇస్తున్నారు కానీ, అధికారులు నిఘాపెట్టి పట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. హేమచంద్రాపురంలో బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసిన అక్రమార్కుడి గురించి అందరికీ తెలిసినా ఎవరూ ఏనాడూ పట్టించుకోలేదు. అంటే ఎంతమంది ఆయనతో లాలూచీ పడ్డారో అర్థమవుతోంది. ఇల్లెందు మండలంలో కూడా అక్రమ బియ్యాన్ని విక్రయిస్తున్న ముఠా గురించి ఎన్నాళ్ల నుంచో అధికారులకు తెలుసు. అయితే, వారు తూతూమంత్రంగా కేసులు పెట్టడం తప్ప శాశ్వతంగా నిలువరించింది లేదు.
రేషన్ షాపులను రెండు పూటలా తీయాలి. అప్పుడే జనాలు బియ్యాన్ని తీసుకుంటారు. కొంతమంది తిరగలేక అమ్ముకుంటున్నారు. మరికొంత మంది దగ్గర డీలర్లే కొనుగోలు చేస్తున్నారు. అధికారుల హస్తం లేకుండా ఇలాంటి వ్యాపారం జరగదు. ఫోన్ సిగ్నల్ లేదని వచ్చిన జనాల్ని ఇంటికి పంపిస్తున్నారు. పేదల కడుపుకొట్టి దర్జాగా దొడ్డిదారి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, కొత్తగూడెం
ఎప్పటి నుండో ఈ వ్యాపారం సాగుతోంది. మా ఊర్లోనే వ్యాపారి ఉన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన అధికారి చొరవ చూపి పట్టుకున్నారు. మొన్నటి వరకు దందా సాగింది. ఇప్పుడు అడ్డా మారుస్తారు. కానీ, అక్రమ వ్యాపారం మారదు. కొత్తగూడెం కేంద్రంగా మా ఊరి నుంచే దందా జరుగుతోంది. నిఘా పెడితే ఈ వ్యాపారి మరింత బట్టబయలవుతుంది.
-తరాల లక్ష్మీనారాయణ, హేమచంద్రాపురం