బోనకల్లు, జనవరి 03 : అధికార బలంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయడం తగదని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో పర్యటించి, ఇటీవల అక్రమ కేసులకు గురైన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుందని, ఆ ఓటమిని తట్టుకోలేకనే కక్షపూరితంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
అధికార ముసుగులో పెడుతున్న ఈ అక్రమ కేసులు తాత్కాలికమేనని, పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, బీఆర్ఎస్ మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరావు, నాయకులు పార ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకుడు గద్దల వెంకటేశ్వర్లు, ఆళ్లపాడు సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరావు, పార్టీ నాయకులు చుక్కారావు, యువజన నాయకుడు సుభాని, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Bonakal : అధికార బలంతో అక్రమ కేసులు : లింగాల కమల్ రాజు