కారేపల్లి, సెప్టెంబర్ 16 : జర్నలిస్టులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు. పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావు కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై వార్తలు సేకరిస్తున్న సాంబశివరావుపై ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసులు అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఖమ్మం పట్టణంలోని బంగారయ్య నగర్లో గల సాంబశివరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి, ప్రశ్నించే పాత్రికేయులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అధైర్య పడకుండా, పిల్లలు కలత చెందకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ సాంబశివరావు కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.