సత్తుపల్లి టౌన్/ వేంసూరు, ఫిబ్రవరి 2: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయా నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. నాయకులను నిద్రిలేపి మరీ వెంట తీసుకెళ్లారు. తమను బ్రష్ కూడా చేసుకోనివ్వకుండా ఎందుకు తీసుకెళ్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించినప్పటికీ.. సమాధానం చెప్పకుండానే పోలీసులు తమ వెంట తీసుకొని వెళ్లారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు.. ఉదయాన్నే సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. పరిస్థితి అదుపు తప్పుతుందేమోనని భావించి అరెస్టు చేసిన 19 మంది బీఆర్ఎస్ నేతలను హుటాహుటిన పొరుగునే ఉన్న వేంసూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. అయితే, తమనెందుకు అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు కొందరు పోలీసులపై మండిపడ్డారు. అయినప్పటికీ 29 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అయితే, సత్తుపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే రాగమయి భర్త దయానంద్.. తమ నేతలనెందుకు అరెస్టు చేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు. అలాగే, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వేంసూరు పీఎస్‌లోని బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. అయితే, ఎన్నికల కోడ్ ఉన్నందున తాము ఆందోళనలేమీ చేయబోమని అటు దయానంద్, ఇటు సండ్ర పోలీసులకు హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయా నాయకుల సంతకాలు తీసుకొని విడుదల చేశారు.
సత్తుపల్లి మున్సిపల్ పాలకవర్గానికి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్నందున బీఆర్ఎస్కు చెందిన పాలకవర్గ సభ్యులు గత నెల 31న అభినందన కార్యక్రమం నిర్వహించుకున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సత్తుపల్లిలో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. ‘డీ’ ట్యాక్స్ (స్థానిక ఎమ్మెల్యే రాగమయి భర్త దయానంద్) పేరున అన్ని వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సండ్ర వ్యాఖ్యలను ఖండించారు.
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని, గత ప్రభుత్వంలోనే అనేక రకాలైన ట్యాక్స్‌లు వసూలు చేశారని ఆరోపించారు. వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సత్తుపల్లి అంబేద్కర్ రింగ్‌సెంటర్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆదివారం రెండు పార్టీల నాయకులూ ఆదివారం సత్తుపల్లి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంటారని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీసుకెళ్లిన వారిలో బీఆర్ఎస్ నేతలు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, అద్దంకి అనిల్, గుండ్రు రాఘవేంద్ర, రఫీ, మల్లూరి అంకంరాజు, వీరపునేని బాబి, దొడ్డా శంకర్రావు, నడ్డి ఆనందరావు సహా మొత్తం 19 మంది ఉన్నారు. ఈ విషయం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు తెలియడంతో పెద్ద ఎత్తున నేతలు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంటున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు.. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను పొరుగునే ఉన్న వేంసూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సత్తుపల్లిలోని ఎమ్మెల్యే రాగమయి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇళ్లకు వెళ్లారు. అయితే, తాము అధికార పార్టీ నేతలమని, తమనెందుకు అరెస్టు చేస్తారని కొందరు నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు ఆ నేతలను అరెస్టు చేసి సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రింగ్‌సెంటర్ వద్ద కూడా పోలీసులను భారీగా మోహరించారు. అయితే, తమ కాంగ్రెస్ నేతలు చల్లగుళ్ల నరసింహారావు, గాదె చెన్నారావు, మానుకోట ప్రసాద్, కమాల్‌పాషా, దోమ ఆనంద్ సహా 29 మందిని అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాగమయి భర్త దయానంద్.. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
తమ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని పోలీసులపై మండిపడ్డారు. అధికార పార్టీ నేతలను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ బయట దయానంద్ విలేకరులతో మాట్లాడారు. సండ్ర వెంకటవీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న 15 ఏళ్లు అవినీతికి పాల్పడ్డాడని, ఆ విషయంలో తమ నేతలు బహిరంగ చర్చకు పిలిచారని, అందుకు తమ నేతలను అరెస్టు చేయడం సబబు కాదని, తక్షణమే వదిలివేయాలని అన్నారు. తాము నిరసనలు చేపట్టబోమని హామీ ఇవ్వడంతో సత్తుపల్లి పట్టణ సీఐ కిరణ్‌కుమార్.. కాంగ్రెస్ నేతల నుంచి సంతకాలు తీసుకొని వదిలివేశారు.
ఇక వేంసూరు పీఎస్‌లోని బీఆర్ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే సండ్ర పరామర్శించారు. నిద్రిస్తున్న తమ నాయకులను వేకువజామునే అక్రమంగా అరెస్టు చేసి ఉన్న పళంగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులను ప్రశ్నించారు. పీఎస్ ఎదుట విలేకరులతో సండ్ర మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలో గడిచిన ఏడాది పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను రుజువు చేసే విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని, చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని అన్నారు.
ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులను ఇబ్బంది పెట్టే విధంగా తాము నిరసన కార్యక్రమాలు చేపట్టబోమని కల్లూరు ఏసీపీ రఘుకు ఫోన్లో హామీ ఇవ్వడంతో వేంసూరు పీఎస్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల నుంచి సంతకాలు తీసుకొని వదిలివేశారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ రఘు మాట్లాడుతూ.. రెండు పార్టీల నాయకులు ఆదివారం బహిరంగ చర్చకు వస్తారనే సమాచారంతోనే వారిని ముందస్తుగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇలాంటి చర్చలు, సభలకు అనుమతి లేదని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే రెండు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ వేంసూరు మండల అధ్యక్షుడు, వెంకటాపురం మాజీ సర్పంచ్ పాల వెంకటరెడ్డిపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పుచ్చకాయల సోమిరెడ్డి వ్యక్తిగత ఆరోపణ చేశాడంటూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మండల బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, పగుట్ల వెంకటేశ్వరరావు, మారోజు సురేష్, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, జాబిశెట్టి కోటేశ్వరరావు, కొండపల్లి రాంబాబు పాల్గొన్నారు.
చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులే సవాళ్లు విసిరారని, బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయించారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంసూరు పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలను పరామర్శించిన అనంతరం పీఎస్ బయట విలేకరులతో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఘర్షణలకు తెరలేపుతున్నారని విమర్శించారు. 15 ఏళ్ల కాలంలో ఇక్కడి శాసనసభ్యుడిగా ఏ రోజు రెచ్చగొట్టి పద్ధతిలో తాను వ్యవహరించలేదని స్పష్టం చేశారు. సవాళ్లు విసిరిందెవరో సత్తుపల్లి ప్రజలకు తెలుసునని అన్నారు. కొత్త ప్రభుత్వ పాలనపై ఏడాది కాలంగా తాము సంయమనం పాటింస్తున్నామని అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఘర్షణలతో సత్తుపల్లి నియోజకవర్గ సంస్కృతికి చెడ్డపేరు సాక్షాత్తూ క్యాబినెట్ మంత్రి తుమ్మల ఇటీవలి అధికారిక సభలో చెప్పినప్పటికీ ఆ పార్టీ నేతలే దానిని భగ్నం చేసుకుంటున్నారని అన్నారు. గంగారంలో కోడిపందేలు నిర్వహిస్తూ అరెస్టయిన నాయకులెవరో, హైదరాబాద్‌లో గంజాయి కేసులో పట్టుబడింది ఏ నాయకుడి కొడుకో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తాము ప్రజల పక్షానే ఉంటున్నామని, ప్రశ్నించే పార్టీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు.