ఖమ్మం, ఫిబ్రవరి 25: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని, తనను గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు గెలిపించారని అన్నారు. వారి రుణం తీర్చుకోవడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. వారికి నిత్యం సేవ చేసేందుకే ‘వాడవాడకూ పువ్వాడ’ కార్యక్రమాన్ని చేపట్టానని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు నగరంలోని 55వ డివిజన్ బ్యాంక్‌కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వాడవాడకూ వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మమే మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఖమ్మంలో తాను ఉన్న సమయంలో రోజూ తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతంలో ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని అన్నారు. తద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఖమ్మం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.వందల కోట్ల నిధులు అందిస్తున్నారని అన్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, మల్లీశ్వరి, రంజిత్, కృష్ణలాల్, రంగారావు, నవ్యజ్యోతి, మోతారపు శ్రావణి, సుధాకర్, బత్తుల మురళీ ప్రసాద్, పైడిపల్లి సత్యనారాయణ, మచ్చా నరేందర్, శైలజ, రాపర్తి శరత్, షకీనా, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు వింటూ.. ముందుకు సాగుతూ..
ఖమ్మం 55వ డివిజన్ అంటేనే మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో మంత్రి అజయ్ ఉదయం 7 గంటలకే పర్యటన ప్రారంభించారు. వీధిల్లో నడుస్తూ సమస్యలు వింటూ.. అపార్ట్మెంట్లు ఎక్కుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆయన తిలకం దిద్ది, హారతిపట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రెయిన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పారిశుధ్య పనుల వంటి సమస్యలను స్థానికులు మంత్రికి వివరించగా ఆయన వెంటనే స్పందించారు. వాటిని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఇస్త్రీ రామయ్యను పలుకరించి..
వాడవాడలా పర్యటిస్తున్న మంత్రి అజయ్.. రోడ్డు పక్కన చిన్న ల్యాండ్రీ షాపు పెట్టుకొని ఇస్త్రీ చేస్తున్న రామయ్య వద్దకు వెళ్లారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి తన వద్దకు వచ్చి తన యోగక్షేమాల గురించి పలుకరించడంతో రామయ్య ఆనందం వ్యక్తం చేశాడు. మంత్రి అతడితో మాట్లాడుతూ.. ‘ఒక చొక్కా, ఒక ప్యాంట్ ఇస్త్రీ చేస్తే ఎంత తీసుకుంటావు? రోజుకు ఎంత సంపాదిస్తావు ?’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు రామయ్య స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఆయన చలువతో రోజుకు రూ.500 వరకూ సంపాదిస్తానని సమాధానమిచ్చాడు.