ఖమ్మం, ఏప్రిల్ 21 : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై హత్యాయత్నం చేయడానికి తాను ప్రయత్నం చేశానని, దానికోసం సుపారి ఇచ్చానని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రం ఖండించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఎలాంటి విచారణనైనా చేసుకోవచ్చని అన్నారు. తప్పుడు కథనాలను పత్రికల్లో రాయిస్తూ, యూట్యూబ్ చానల్స్‌లో ప్రసారం చేస్తూ బీఆర్ఎస్ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగించాలనుకోవడం దుర్మార్గపు చర్య అని అన్నారు. హత్యా రాజకీయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిఉంటే ఈరోజున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న నాయకులు గతంలో బీఆర్ఎస్లో కూడా మంత్రులుగా, ఎంపీగా ఉన్నవారే కనుక వారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు ఉండేవా అన్నారు. అమలుకానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వాటిని అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి కథలను అల్లుతున్నారని అన్నారు. ఖమ్మంజిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశామే తప్ప ఇటువంటి చర్యలకు ఎప్పుడు పాల్పడలేదన్నారు. నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని తెలిపారు.
కాంగ్రెప్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అమలుచేసేంత వరకూ ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని, పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉండి, మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఎకడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హత్య, దాడుల సంసృతిని ఖండించారు.
బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్‌ను కాంగ్రెస్ గుండాలు హత్య చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులు జరుగుతున్నాయని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మహానేత కేసీఆర్ నెత్తురు చిందకుండా తెలంగాణ మహోద్యమాన్ని శాంతియుత పద్ధతుల్లో నడిపించి రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. హింసకు, హత్యా రాజకీయాలకు తమ పార్టీ బీఆర్ఎస్, అధినేత కేసీఆర్ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. నామా విజయం ఎప్పుడో ఖాయమైందని, భారీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంపీ వద్దిరాజు చెప్పారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుతూ, తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. నారాయణఖేడ్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పండితాపురం, పాలేరు లాంటి చోట్ల తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. నామా మొదటి విడత ప్రచారం ముగిసిందని, 6 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తికాగా రెండో విడత ప్రచారం 25వ తేదీ ప్రారంభమవుతుందన్నారు. ప్రజల నుంచి నామాకు సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యారన్నారు. బీసీకి చెందిన డీసీసీబీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించారని అన్నారు. మాజీమంత్రి పువ్వాడపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పగడాల నాగరాజు, డోకుపర్తి సుబ్బారవు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.