“తెలంగాణ వచ్చినంకనే కరెంట్ కష్టాలు తీరినయ్.. పొలం దగ్గర ఎదురుచూపులు తప్పినయ్.. పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతున్నది.. ఇప్పుడు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేవు.. కాలిపోయే మోటర్లు లేవు.. పాముకాట్లు.. పడిగాపులు.. కరెంట్ షాక్‌లు తప్పినయ్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ఏడు గంటల కరెంట్ ఇవ్వలే. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయం ఆగమైతది.. రైతులు మళ్లీ కష్టాల పాలైతరు” అని రైతులు ఘంటాపథంగా చెప్తున్నరు. నాడు మోటర్లు కాలిపోతే.. వాటిని మరమ్మతులు చేసేందుకు టైం సరిపోయేది కాదు.. అర్ధరాత్రుళ్లు కూడా పొలం వద్దకు వెళ్లి రిపేర్ చేసేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోటర్ రిపేర్లు చాలా తక్కువైనయి.. అంటూ మెకానిక్‌లు వెల్లడిస్తున్నరు.
పంటలకు పేరుకు రోజుకు ఏడు గంటల ఉచిత కరెంట్. ఉదయం మూడు గంటల కరెంట్ వచ్చిందంటే మళ్లా ఎప్పుడొస్తదో తెల్వదు. వస్తే వస్తది లేకపోతే లేదు. రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని కరెంట్ కోసం ఎదురుచూసేవారు. రాత్రిళ్లు పొలం వద్దే జాగారం చేసేవారు. వచ్చే కరెంట్‌లో మళ్లా అప్ అండ్ డౌన్స్. మోటర్లు కాలిపోయేవి. వాటి మరమ్మతులకు రైతుల చేతిచమురు వదిలేది. ట్రాన్స్ఫార్మర్లు పోతే కరెంటోళ్లు పట్టించుకునేటోళ్లే కాదు. మళ్లా రైతులే చందాలు వేసుకుని రిపేర్ చేయించుకునేటోళ్లు. పాముకరిచిన రోజు, కరెంట్ షాక్ కొట్టి నాడు ఎంతోమంది రైతన్నలు ప్రాణాలు వదిలిండ్రు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డయి. పంటను కాపాడుకోవడానికి ఎంతో మంది రైతులు డీజిల్ మోటర్లు పెట్టి అప్పుల పాలైన్రు. ఇలా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పాలనలో అన్నీ కటిక చీకట్లే.
పంటలకు 24 గంటల ఉచిత విద్యుత్తు దండగ. కేవలం మూడు గంటల కరెంట్ సరిపోద్ది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే పంట అమాంతం తడుస్తది. కానీ లక్ష సొమ్ము పెట్టి మోటరు ఎవరు కొనిస్తరో, మోటర్‌కు అవసరమైన వైర్లు, పైపుల సరంజామా ఎవరు ఇస్తరో.. ఏ నాయకుడూ చెప్పడు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో విద్యుత్ కష్టాలు తీరుస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం రోజుకు 5 గంటల కరెంట్ ఇచ్చి రైతులను అరిగోస పెడుతున్నది.
కాంగ్రెసోళ్ల కాలంలో ఎవసాయం చేసి కరెంటు కోసం ఎన్ని కష్టాలు పడ్డామో రేవంత్‌రెడ్డికి ఏం తెలుసు. ఆయనవి బేకార్ మాటలు. ఇండ్లు వదిలి రాత్రి పొలాల దగ్గరే పడుకునేది. కంటికి నిద్ర ఉండేది కాదు. కరెంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. మూడు గంటల కరెంటు గురించి రేవంత్ మాట్లాడ్డం మానుకోవాలి. లేకపోతే జనాలు ఆయనకి బుద్ధిజెప్తరు. సీఎం కేసీఆర్ సారుకు మా కష్టాలు తెలుసు. అందుకే ఎవరి మాటా లెక్కజేయకుండా ఫుల్ కరెంటిస్తుండు. అవసరమైనంత కరెంటు వినియోగించుకుంటున్నం. ఆప్పుడప్పుడు కరెంటోళ్లు కూడా వచ్చి చూసి పోతుంటరు. రిపేర్లు ఏమన్న ఉంటే చెప్పంగనే చేస్తరు.
ఉమ్మడి పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులతోపాటు పారిశ్రామిక రంగాలకు, చేతివృత్తిదారులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నది. రైతులతోపాటు మాలాంటి మెకానిక్‌లు, చేతివృత్తిదారులకు చేతినిండా పని దొరికింది. నిరంతర విద్యుత్ వల్ల రైతులు పొలాలకు నీరు అందించే మోటర్లు మరమ్మతుకు గురైతే వెంటనే పొలం వద్దకు వెళ్లి మోటర్‌ను బాగు చేసి ఇస్తున్నా. ఉమ్మడి పాలనలో మూడు గంటలు సరఫరా ఉండడం కనాకష్టంగా ఉండేది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైతులతోపాటుమేము కూడా తెల్లవార్లు కరెంటు కోసం తిప్పలు పడేవాళ్లం. పంటలు సైతం ఎండిపోయేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో ఆ పరిస్థితి లేదు.
కరెంట్ కోసం పడిగాపులు.. పొలం వద్దే జాగారాలు.. పాముకాట్లు.. కరెంట్ షాక్‌లు.. రైతుల ప్రాణాలతో చెలగాటాలు.. కాలిన మోటర్లు.. పేలిన ట్రాన్స్ఫార్మర్లు.. ఇవీ కాంగ్రెస్ పాలనలో సాగిన ‘సాగు’బాటు. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంటలకు ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అన్న మాటే గానీ ఆచరణలో అది ఎప్పుడూ జరగలేదు. కరెంట్ ఎప్పుడు వస్తదా .. అని రైతులు ఎదురుచూసేవారు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఒక మడి కష్టంగా పారేది.. మడి చివరికి నీరు చేరేలోపే కరెంట్ హుష్ కాకి..! రాత్రికి ఎప్పుడో మళ్లా కరెంట్ వస్తే తడిసిన మడే మళ్లా తడిసేది. రాత్రిళ్లు రైతులు బ్యాటరీలు వేసుకుని పొలానికి వెళ్లేవారు. అక్కడే కునుకు తీస్తూ కరెంట్ రాగానే ఉలిక్కిపడి లేచేవారు. అలా పొలాలకు వెళ్లి పాముకాటుకు గురై, కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వారెందరో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల గోస తీరింది. పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. ఎవుసం ఇలా పచ్చగా సాగుతుంటే కాంగ్రెసోళ్ల కళ్లలో జిల్లేళ్లు మొలిచినయి అనుకుంటా..! పంటలకు ముద్దుగ మూడు గంటల కరెంట్ ఇస్తరంట.. లక్షల సొమ్ము పెట్టి 10 హెచ్‌పీ మోటర్లు, సరంజామా బిగించుకోవాల్నట. కాంగ్రెసోళ్ల అతీ గతీ లేని మాటలపై నిప్పులపై నిప్పులు చెరుగుతున్నరు రైతులు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఖతమైతదని, మళ్లా పాత రోజులు వస్తయని బాజాప్తుగా చెప్తున్నరు.
ఉమ్మడి పాలకుల ఏలుబడిలో కరెంట్ కష్టాలను ఏ రైతూ మరచిపోలేదు. ఆనాడు వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు కరెంట్ ఇచ్చిన విధానం.. నేడు సీఎం కేసీఆర్ పాలనలో అందిస్తున్న విధానాన్ని రచ్చబండల వద్ద రైతులు బేరీజు వేసుకుంటున్నారు. రైతులు 10హెచ్‌పీ సామర్థ్యం గల మోటర్లతో 3 గంటల విద్యుత్ ఇస్తానన్న మతిలేని రేవంత్‌రెడ్డి మాటలను యావత్ తెలంగాణ పల్లె రైతాంగం గమనిస్తోంది. యావత్ రైతాంగం మూడోసారీ సీఎం కేసీఆర్‌ను గెలిపించుకొని 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను మూడోసారి ఇప్పించుకుంటాం.
నా పేరు ఆంగోత్ లఘుపతి. మాది టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీ వెంకట్యాతండా. నేను 25 ఏళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నా. 2014కు ముందు కాలిపోయిన రైతుల మోటర్లను చూడాలంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు కాసేవారం. రాత్రుళ్లు కూడా మోటర్ల వద్దకు వెళ్లి బాగు చేసిన సందర్భాలెన్నో. కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ సమస్యలు తగిపోయి నిరంతరం కరెంట్ ఉండడంతో మోటర్లకు లో వోల్టేజీ సమస్య లేదు. ఇప్పుడు రైతులకు కరెంట్ సమస్య తగ్గి పంటలు బాగున్నాయి. కరెంటు సమస్య తీర్చిన సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ధన్యవాదాలు.
కాంగ్రెస్ నాయకులు అన్నట్లు 10హెచ్‌పీ మోటర్లు బిగిస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఖాయం. అంతేకాక భూగర్భ జలం నిండుకోవడంతోపాటు మోటర్లపై లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్లపై పడి కాలిపోతాయి. ఇవన్నీ తెలిసిన రైతులెవరూ ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ విధానానికే మొగ్గుచూపుతారు. కానీ.. కాంగ్రెస్ నాయకుల మాటలకు, చేతలకు పొంతన లేకుండా సత్యదూరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు ముఖ్యమంత్రిగా ఉండడం వలనే రైతులకు అత్యంత ప్రాధాన్యం పెరిగింది. సీఎం కేసీఆర్ మూడోసారీ ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులంతా కోరుకుంటున్నాం.
నేను మూడు ఎకరాల సీడ్ మక్క పంట సాగు చేస్తున్నా. గతంలో సాగు చేసిన పంటలకు నీటితడులు అందించేందుకు రాత్రుళ్లు సైతం మోటర్ వద్ద నిద్ర చేసేవాడిని. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ఇబ్బంది పడేవాడిని. ఒకవైపు ఎండిపోతున్న పంటను చూసి కన్నీళ్లొచ్చేవి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కార్‌లో నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఉద్యోగుల మాదిరిగానే ఉదయం 9 గంటలకు పొలంలోకి వెళ్లి సాయంత్రం వరకు నీటితడులు పెట్టుకొని ఇంటికి వస్తున్నా.
గత కాంగ్రెస్ పాలనలో సరిగా కరెంటు ఉండేదికాదు. పొలాల వద్ద తోటి రైతులతో కలిసి మోటర్ల వద్ద కరెంటు కోసం పడిగాపులు పడేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు 3 గంటల విద్యుత్ చాలు.. 10హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 10హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేస్తే ఇచ్చిన కరెంటు సరిపోకపోవడంతోపాటు మోటర్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు పేలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులు రాజుగా మారి వ్యవసాయం చేస్తున్నారు.
గత కాంగ్రెస్ హయాంలో లో వోల్టేజీ, అరకొర విద్యుత్‌తో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మాకు వైండింగ్ పని ఎక్కువగా దొరికేది. ఎప్పుడూ హడావుడిగా ఉండేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల బాధలు తప్పాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆ పరిస్థితి మారింది. మాకు పూర్తిగా పనిభారం తగ్గింది. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
నేను 40 ఏళ్లుగా మోటరు మెకానిక్‌గా పనిచేస్తున్నా. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లోవోల్టేజీ, అరకొర విద్యుత్ వల్ల మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు నిత్యం కాలిపోయి మాకు వైండింగ్ పని ఎక్కువగా దొరికేది. ఎప్పుడు ఏ రైతు ఫోన్ చేస్తాడో తెలియని పరిస్థితి. కానీ.. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో పరిస్థితి మారింది. మాకు పనిభారం తగ్గింది. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా అవుతుండడంతో మోటర్లు కాలిపోయే అవకాశం లేదు. మాకు పనిభారం తప్పినప్పటికీ రైతులు సంతోషంగా ఉండడం మాకు సంతోషంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుండడంతో ఈ ఏడాది పంట పుష్కలంగా పండింది. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి లేదు. నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందుతుండడంతో సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ వస్తే 10హెచ్‌పీ మోటర్లు కొనుగోలు చేయాలి. మూడు గంటలే కరెంటు ఇస్తామనే వార్తలు వినిపిస్తున్నాయి. 10హెచ్‌పీ మోటరు కొనుగోలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందే. మాకు ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
రేవంత్‌రెడ్డి అన్నట్లు మూడు గంటల విద్యుత్‌తో ఒక్క మడి అయినా తడుస్తుందా. ఈ విషయం ఆయనకు తెలుసా.. నాకున్న ఆరెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్‌తో నాణ్యమైన పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెసోళ్ల మాటలతో మళ్లీ తిరిగి పాతరోజులు వస్తాయంటేనే భయం వేస్తోంది. గతంలో ఎప్పుడు కరెంటు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి. కానీ.. నేడు ఆ పరిస్థితులు లేవు. రైతుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తే 5హెచ్‌పీ మోటర్లతో పంటలు పండించుకుంటాం. సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 24 గంటల కరెంటుతో మా పంటలకు ఢోకా లేదు. నేను ఆరెకరాలు సాగు చేస్తున్నా. నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడంతో పంటలు బాగా పండుతున్నాయి. కాంగ్రెస్ పాలకుల హయాంలో ఏడు గంటలు, మూడు గంటలు కరెంటు ఇస్తే పంట తడవక.. సుమారు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు నష్టపోయాను. మోటర్లు కాలిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు మూడు గంటలు కరెంటు చాలు.. 10హెచ్‌పీ మోటర్లతో ఎకరం తడుస్తుందని చెప్పడం సరికాదు. 10హెచ్‌పీ మోటర్లు కొనుగోలు చేయాలంటే రైతుకు తలకుమించిన భారం. కరెంటు లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు సైతం పేలే అవకాశాలు ఎక్కువ. 24 గంటల కరెంటుతోనే మేలు జరుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం వల్లనే పంటలు బాగా పండుతున్నాయి. ఏ మేరకు నీరు అవసరమో ఆ మేరకు పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాం. కరెంటు లేకపోతే వ్యవసాయం బంద్ చేసుకోవడమే ఉత్తమం. కరెంటు జోలికొస్తే ఊరుకునేది లేదు. మాకు మంచి పరిపాలన సాగుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయం.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటి నిల్వతోపాటు భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో నీరు సుమారు 120 నుంచి 160 అడుగుల్లో ఉంది. ఖరీఫ్, రబీలో పంటలు సాగు చేసుకుంటున్నాం. కరెంటు సమస్య లేదు. సీఎం కేసీఆర్ దయవల్ల 3 ఎకరాల పోడు భూమికి పట్టా వచ్చింది. కరెంటు 24 గంటలు ఉండడం వల్ల మా గ్రామంలోని గిరిజనులు చాలా మంది మోటర్లు బిగించుకుని తడులు పెడుతున్నారు. 3 గంటల కరెంటు వల్ల ఎకరం తడి పెట్టాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రోజులే.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాతరోజులే వస్తాయి. 10హెచ్‌పీ మోటరు ద్వారా గంటలో ఎకరం నీరు పారించవచ్చని రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. కేసీఆర్ వచ్చాక 24 గంటలు విద్యుత్ నిరంతరాయంగా అందుతుండడంతో రైతులు ఎప్పుడు పొలాలకు వెళ్లినా మోటరు వేసుకుని సాగు పనులు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతుగా భయం పట్టుకుంది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతులకు మేలు జరుగుతుంది.
తెలంగాణ రాక ముందు పొలానికి నీళ్లు పెట్టేందుకు విద్యుత్ మోటర్ల వద్ద నేను, మా నాన్న ఇబ్బందిపడ్డాం. కరెంట్ ఎప్పుడో రావడంతో మోటర్లు లోడ్ ఎత్తుకోవడం వల్ల ఫీజులు పోవడంతో మళ్లీ ఉరుకులు పరుగులు పెట్టేవాళ్లం. ఎకరానికి నీళ్లు పెట్టాలంటే దాదాపు మూడు రోజులు రేయింబవళ్లు కష్టపడితేనే నీళ్లు పట్టేవి. కానీ.. సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల పొలాలకు పూర్తిగా నీరు పారుతోంది. ఆనాడు కష్టాన్ని చూశాం.. ఈనాడు సౌలభ్యాన్ని చూస్తున్నాం. ఒక రైతుకు ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంది.
గతంలో అరకొర విద్యుత్‌తో మోటర్లకు ఒక్కసారిగా స్విచ్ వేయడంతో కొన్ని మోటర్లు కాలిపోవడం, కొన్ని ఇబ్బంది పెట్టడం ఇదే సరిపోయేది. విసుగెత్తి మోటర్ల వల్ల వ్యవసాయం చేయడంతో మాతో కాదని దేవుడిపై భారం వేసేవాళ్లం. కానీ.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కారు చీకట్లను పారదోలుతూ నిరంతర విద్యుత్ ఇస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఎకరం కూడా ఇంతవరకు ఎండిపోయిన దాఖలాలు లేవు. తెలంగాణ వస్తే ఇంత ఉపయోగం ఉంటుందనేది రైతులకు కళ్లారా కనిపిస్తున్నది.
నేను 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. గతంలో కరెంట్ కోతలతో రాత్రింబవళ్లు ఇబ్బందులు పడ్డాం. కరెంట్ కోతలతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరిగేవి. కానీ.. ఇప్పుడు అలాంటి కష్టాలు లేవు. తెలంగాణ ప్రభుత్వంలో పూర్తిగా కరెంట్ ఉండడం, బావులు, బోర్లలో నీరు ఉండడంతో 24 గంటల కరెంట్‌తో బాగా పంటలు పండుతున్నాయి. ఆటోమేటిక్ స్టార్టర్లతో ఇంటి వద్ద నుంచే పొలాలకు నీరు పారించుకొంటున్నాం. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత కరెంట్ కష్టాలు పూర్తిగా తీరాయి.
కాంగ్రెస్ చెబుతున్నట్లు మూడు గంటల కరెంట్‌తో రోజుకు ఒక్క మడి కూడా నీరు పారదు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న 24 గంటల వ్యవసాయ విద్యుత్‌తో రెండు పంటలు పండించుకుంటున్నం. 10హెచ్‌పీ మోటర్తో మొత్తం 3 గంటల్లోనే పొలానికి నీళ్లు పారించుకోవచ్చన్న రేవంత్‌రెడ్డి మాటలు వట్టి బూటకం. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి లాభం పొందేందుకే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. 24 గంటల వ్యవసాయ విద్యుత్ ఉచితంగా ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకే అండగా నిలుస్తాం.
నేను వ్యవసాయ అనుబంధ ప్రైవేటు కంపెనీలో మూడేళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నా. మా స్వగ్రామం గోగులంపాడులో 5 ఎకరాల సొంత భూమి ఉంది. అక్కడి సర్కారు విధానాలకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలకు సంబంధం లేదు. ఇక్కడి రైతాంగానికి నిరంతర విద్యుత్, రైతుబంధు, సకాలంలో ఎరువులు అందుతున్నాయి. సబ్సిడీలపై డ్రిప్, పైపులైన్లు సైతం ఇస్తున్నారు. ఇలాంటి విధానాలు మా దగ్గర కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
పొలాలు, చేలకు ఆరుతడులు కట్టేందుకు గతంలో అష్టకష్టాలు పడ్డాం. ఆ పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటేనే మంచిది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల మాకున్న 20 ఎకరాల మెట్ట, వరి పొలానికి పుష్కలంగా నీరు పారుతోంది. ఇక పంటలకు ఢోకా లేదు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు మళ్లీ అగాధంలో పడతాయి. తెలంగాణ ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. రైతుబంధు సాయంతో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు తీసుకొని పంటలు పండించుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలి.
వ్యవసాయ రంగంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు. చిన్న, సన్నకారు రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందనడంలోనే ఆయన ఆంతర్యమేమిటో అర్థమవుతోంది. రైతాంగం 10హెచ్‌పీ మోటర్లు వాడతారంటూ మరోమారు అనడం ఆయనకు అవగాహన లేకపోవడమే. రైతాంగం బోర్లకు 3హెచ్‌పీ లేదా 5హెచ్‌పీ మాత్రమే వినియోగిస్తారనే సంగతి తెలియకపోవడం విడ్డూరంగా ఉంది.
తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ సర్కారు అవలంబిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించడం వారి తరం కాదు. కాంగ్రెస్ హయాంలో ఏ సమయంలో కరెంట్ వచ్చేది ఎవరికీ తెలియకపోయేది. రాత్రి సమయంలో పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌లు, పాము, తేలు కాట్ల మరణాలు కోకొల్లలు. రైతాంగానికి అనుకూలమైన విధానాలు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ కొనసాగాలి.
సన్న, చిన్నకారు రైతులకు కేవలం 3 గంటల కరెంట్ కంటే ఎక్కువ అవసరం లేదని రేవంత్‌రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం. రైతుల కష్టాలు తెలియని కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి అందించే విద్యుత్‌పై మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సీఎం కేసీఆర్ నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందిస్తుండడంతో రైతులు రెండు పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలను రైతులు నమ్మరు.
రాష్ట్రంలో రైతులు పచ్చగా ఉన్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నానా అవస్థలు పడ్డాం. వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు తీస్తారో తెలియదు. ట్రాన్మ్పార్మర్ల ఫీజులు పోవడం, రాత్రి సమయాల్లో మోటర్లకు కరెంట్ ఇవ్వడంతో చుట్టపక్కల్లో నా సహచర రైతులు పాము, తేలు కాట్లకు గురై మృతి చెందారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మళ్లీ కాంగ్రెస్ వస్తే అదే పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మం.
రైతుల కష్టాలు కాంగ్రెస్ నాయకులకు తెలియదు. గతంలో వారి పాలనలో అరిగోసపడ్డాం. సమయానికి విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు పండించలేక అప్పులు పాలయ్యేవాళ్లం. మళ్లీ 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు అధికారంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు 24 గంటల కరెంట్‌ను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. రైతులు కోరికోరి కష్టాలు తెచ్చుకోరు.
రైతు బాధలు తెలిసిన నేత కేసీఆర్. గతంలో వైరా రిజర్వాయర్ పరిధిలో నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉండేది. కరెంటు మోటర్ల ద్వారానే వ్యవసాయం చేస్తుండేవాడిని. పదేళ్లుగా 24 గంటలు కరెంటు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో పది ఎకరాల్లో 30 ఏళ్లుగా కరివేపాకు పంట సాగు చేస్తున్నా. కాంగ్రెస్ హయాంలో నిరంతరం కరెంటు కష్టాలతో పంట పండించడానికి ఇబ్బందిపడ్డా. పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో సాగు, తాగునీరు ఉండడం, కరెంటు కష్టాలు లేకపోవడంతో పంట సాగు చేసి లాభాలు పొందుతున్నా. ఇబ్బంది లేకుండా కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
కాంగ్రెస్ నాయకులు అన్నట్లు 3 గంటల కరెంట్ ఇస్తే వ్యవసాయం చేయడం ఎలా సాధ్యమవుతుంది. అలా ఇస్తే రెండు మడులు కూడా తడవడం కష్టమే. 10హెచ్‌పీ మోటర్‌కు రూ.50వేల ఖర్చువుతుంది. పైపులకు రూ.50వేలు అవుతుంది. నేనిప్పుడు 3హెచ్‌పీ మోటర్ వాడుతున్న. నాకు రెండెకరాల మిర్చి తోట ఉంది. సీఎం కేసీఆర్ వచ్చినంక 24 గంటల కరెంట్ వస్తున్నది. మంచిగా వ్యవసాయం చేస్తున్నం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. పంటలు బాగా పండుతున్నయి. కొంచెం బాగుపడుతున్నం.
నాకు ఎకరంన్నర తోట ఉంది. ఇందులో కొంత వంగ, మిర్చి, వరి పంట వేసిన. 24 గంటల కరెంట్ ఇస్తుంటునే బోరులో నీరు సరిపోక కొంచెం సేపు మోటర్ వేసి అపుకుంటూ నడుపుకుంటున్న. అలాంటిది 3 గంటలు ఇస్తామంటే ఒక్క మడి కూడా తడవదు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న 10హెచ్‌పీ మోటర్లు పెడితే నీళ్లు ఎక్కడున్నవి. సీఎం కేసీఆర్ ఇప్పుడిస్తున్న 24 గంటల నాణ్యమైన కరెంటు రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. 3 గంటల కరెంట్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. రైతులను ముంచే మాటలు చెప్పొద్దు.
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు, కష్టాలే మిగిలాయి. రైతులకు 24 గంటల విద్యుత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నిరంతరాయంగా అందిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోం. రైతులకు 3 గంటల కరెంట్ చాలు.. 10హెచ్‌పీ మోటర్లు బిగించాలి అనే మాటలు రైతులను ఇబ్బంది పెట్టేందుకు చేసే కుట్ర. రైతులు కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు.
గత పాలకులు వేళకు కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం కరెంటు విషయంలో ఎంతో మేలు చేసింది. నాకు 5 ఎకరాల భూమి ఉంది. 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడంతో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఇప్పటి వరకు రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలే లేవు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఈ మధ్యలో వచ్చే వేరే పార్టీలవైపు కన్నెత్తి కూడా చూడం. మా మద్దతు మా సీఎం కేసీఆర్ సార్కే.
10హెచ్‌పీ మోటర్లు ఉపయోగిస్తే ఆర్థిక భారం పడుతుంది. 10హెచ్‌పీ మోటర్ల వల్ల బోరు బావులు త్వరగా ఇంకిపోయే ప్రమాదం ఉంది. రైతులకు 3 వ్యవసాయ పంపు సెట్లు 3,5 హెచ్‌పీ మోటైర్లెతే సరిపోతాయి. అంతకంటే ఎక్కువ హార్స్ పవర్ అవసరం లేదు. ప్రస్తుతం 3, 5 హెచ్‌పీ మోటర్లతో రైతులు ఇబ్బంది లేకుండా నీళ్లు పెట్టుకుంటున్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడంతోనే రైతులకు మేలు జరిగినట్లు అవుతుంది.