రఘునాథపాలెం, మే 23 : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్ దత్త ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగా అరుణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేశ్ దత్త మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్ల పీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. బకాయిలను అడిగితే ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగా అరుణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
తక్షణమే జీవో నెం.7ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్ల్లు, మోత్కూరి నారాయణరావు, బక్క జడ్సన్, వేముల రామకృష్ణలు దీక్షకు సంఘీభావం తెలిపారు. బీసీ టౌన్ ప్రెసిడెంట్ గోనె శ్రీశ్రీ, ఎండీ ఠాగూర్, జయంత్ యాదవ్, హరియాదవ్, చింతల రోహిత్, బాషబోయిన ఉపేందర్, ప్రవీణ్, మనోజ్, శేఖర్, సైదులు, అనిల్ పాల్గొన్నారు.