రెండేళ్లుగా కనీస గిట్టుబాటు ధరలేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ఆయిల్‌పాం రైతులు ఇప్పుడిప్పుడే ఖుషీ అవుతున్నారు. క్రూడాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం విధించడంతో ఒక్కసారిగా గెలల ధర భారీగా పెరిగింది. ఫలితంగా ఆయిల్‌పాం సాగు విస్తరణ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయిల్‌ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ – రష్యా దేశాల యుద్ధం కారణంగా పామాయిల్ దిగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడి గెలల ధర అనూహ్యంగా రూ.23 వేలు దాటిపోయింది.
తర్వాత దిగుమతి సుంకం ఎత్తివేయడంతో దశల వారీగా గెలల ధర పడిపోయింది. అప్పటి నుంచి గిట్టుబాటు ధరలేక ఆయిల్‌పాం రైతులు ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. రైతు సంఘాల వినతికి స్పందించిన కేంద్రం.. దిగుమతులపై మళ్లీ సుంకం విధించడంతో గెలల ధర భారీగా పెరిగింది. రూ.2,651 మేర పెరిగి టన్ను ధర రూ.17,043కు చేరింది. పెరిగిన ధరతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అశ్వారావుపేట, అక్టోబర్ 3: దీర్ఘకాలిక నికర ఆదాయం అందించే ఆయిల్‌పాంపై అధికశాతం మంది రైతులు ఆసక్తి పెంచుకుని సాగు చేస్తున్నారు. దళారులు లేకుండా పండించిన పంటను నేరుగా ఆయిల్‌ఫెడ్ కొనుగోలు చేసి ముందుగా ప్రకటించిన ధరను రోజుల వ్యవధిలోనే చెల్లిస్తుండడంతో సాగు కూడా అమాంతం పెరిగింది. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, రైతులకు ఆర్థిక భరోసా వంటివి లభించడంతో గత కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తరణకు ప్రణాళికను చేపట్టింది.
10 లక్షల ఎకరాల్లో సాగు పెంపు లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఆయిల్‌ఫెడ్‌కు ఎనిమిది జిల్లాలను, మిగతా 23 జిల్లాలను 12 ప్రైవేట్ కంపెనీలను కేటాయించింది. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆయిల్‌పాం సాగు గత కేసీఆర్ సర్కార్ ముందుచూపుతో రాష్ట్రంలో భారీగా విస్తరించింది. ఇప్పుడు రాష్ట్రంలో సుమారు 2.03 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. కేవలం ఉమ్మడి జిల్లాలోనే సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మాత్రమే ఆయిల్‌పాం గెలల ధర రూ.23 వేలు దాటింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడంతో ధర పతనం దిశగా వెళ్లింది. దీంతో గడిచిన రెండేళ్లలో టన్ను గెలల ధర రూ.14,500 వేలు కూడా దాటలేదు. రూ.12 వేల నుంచి రూ.14,500 వేల మధ్య దోబూచులాడింది. దీంతో రైతులు తోటల నిర్వహణ గిట్టుబాటుగాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తరించాలన్న సర్కారు లక్ష్యంగా నెమ్మదించింది. టన్ను ధర రూ.23 వేలు దాటినప్పుడు తోటల నిర్వహణ, పెరిగిన కూలీల వ్యయం తగ్గకపోవడం వంటి కారణాలతో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.
అప్పటి నుంచి కనీసం టన్ను ధర రూ.20 వేలు ఉండాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ దశలోనే ఖమ్మం పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రైతు సంఘం నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. ఇందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. దిగుమతి సుంకాన్ని 20 శాతం, ఇతర పన్నులను 7.5 శాతం కలిపి మొత్తం 27.5 శాతాన్ని విధించడంతో గెలల ధర అదనంగా రూ.2,651కు పెరిగింది. దీంతో టన్ను ధర అమాంతం రూ.17,043కు చేరింది. దీంతో పామాయిల్ రైతులు ఖుషీఖుషీ అవుతున్నారు.
రైతులు ఆశించిన స్థాయిలో ఆయిల్‌పాం గెలల ధర భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం విధించడంతో ప్రస్తుతం ఉన్న టన్నుల గెలల ధర రూ.14,392 నుంచి రూ.17,043కు చేరింది. ఈ ధర ఆయిల్‌పాం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. రైతులకు దీర్ఘకాలం నికర ఆదాయం అందించే ఆయిల్‌పాం సాగుతోనే భవిష్యత్‌కు భరోసా ఉంటుంది. ఈ దశగా ఇతర రైతులు ఆలోచన చేసి ఆయిల్‌పాం సాగు వైపు దృష్టి సారించాలి.
-ఆకుల బాలకృష్ణ, ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్, అశ్వారావుపేట