భద్రాచలం, ఏప్రిల్ 8: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం జరిగిన నిత్య కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 276 జంటలు పాల్గొన్నాయని, ఇప్పటి వరకు ఆలయ చరిత్రలో ఇదే అత్యధికమని దేవస్థానం అధికారులు తెలిపాయి.. వారాంతం కావడం, వరుసగా మూడు రోజులు సెలువు దినాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చారు. అలాగే, ఇక్కడి నుంచి పాపికొండలు యాత్రకు వెళ్తున్నారు. భకుల్త రద్దీని ముందుగానే ఊహించిన దేవస్థానం అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈవో రమాదేవి, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ తదితరులు అంతరాలయంలో ఉండి భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
భద్రాద్రి సీతారామచంద్రస్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పోటేత్తారు. రామయ్యను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గురువారం రాత్రి నుంచే భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ‘జై శ్రీరామ్’ అంటూ భక్తుల చేసిన జయజయధ్వానాలతో రామాలయ మాఢ వీధులు మార్మోగాయి. క్యూలైన్లలో, లడ్డూ ప్రసాదాల కౌంటర్లలో ఎక్కడా చూసినా భక్తులే దర్శనమిచ్చారు.
రామయ్యకు స్వర్ణ తులసి పూజలు
భద్రాచలం, ఏప్రిల్ 8: భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం అంతరాలయంలో మూలవరులకు అర్చకులు శనివారం స్వర్ణ తులసి పూజలు చేశారు. నిత్య కల్యాణ మూర్తులకు బేడా మండపంలో శాస్ర్తోక్తంగా నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు, శేష వస్ర్తాలు అందజేశారు.