అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ప్రకృతి ప్రకోపానికి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.. గత యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటడం, సాగర్ నీళ్లు రాకపోవడంతో కనీసం తిండిగింజలు కూడా పండలేదు.. భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. దీంతో ఈ వానకాలమైనా పంటలు బాగా పండించి ఆర్థికంగా నిలబడదామనే గంపెడాశతో సాగు చేపట్టిన రైతన్నలపై వరుణుడు పగపట్టాడు. అతి భారీ వర్షాలు కురవడంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయ్యింది.
వరదలకు పంట దెబ్బతినడమే కాకుండా పంటపొలాల్లో ఇసుక మేటలు వేయడం, బండరాళ్లు చేరడం మరింత విషాదకరం. అతివృష్టి దెబ్బకు కోలుకోలేని స్థితిలోకి విసిరేయబడ్డారు. మొత్తానికి వరుస నష్టాలతో ఖమ్మం జిల్లా రైతన్నలు కుదేలయ్యారు. పెట్టుబడికి చేసిన అప్పుల బాధతో కుమిలిపోతున్నారు. తమకు వ్యవసాయం మాత్రమే తెలిసిన అన్నదాతలు అప్పులు తీరే దారి లేక మదనపడుతున్నారు. కొంతలో కొంతైనా ప్రభుత్వం ఆదుకోకపోతుందా.. అని సాయం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.
– ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 11
ఒక్కరోజు వ్యవధిలోనే యావత్ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. పంటలు గంగపాలు కావడంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. పోయిన యాసంగిలో సాగర్ కాలువకు నీటి విడుదల లేకపోవడం, తీవ్ర నీటి ఎద్దడి కారణంగా భూగర్భ జలాలు అడుగంటడంతో వేలాదిమంది సాగుకు దూరంగా ఉండిపోయారు. కనీసం తిండి మందమైన పంటను పండించుకోలేని పరిస్థితి యాసంగిలో కనిపించింది. అయితే ఆ లోటును వానకాలం సీజన్లో పూడ్చుకుందామని ఎన్నో ఆశలతో సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వం ఏటా అందిస్తున్న పంటల పెట్టుబడి సాయం(రైతుబంధు) అందకపోయినప్పటికీ అప్పులు చేసి మరీ సాగు చేపట్టారు. వానకాలం సీజన్లో వరదలు వచ్చేనాటికి జిల్లావ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. నెలరోజుల నుంచి మిర్చితోటల సాగు చేపడుతున్నారు. వానకాలం సీజన్‌కు సంబంధించి పెసర పంట మాత్రమే అక్కడక్కడ చేతికి వచ్చింది. పత్తి పంట మరో నెలరోజుల్లో ఏరే సమయం ఆసన్నమైంది. వరికి సంబంధించి పంట పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి. పెట్టుబడికి వెనకాముందూ ఆలోచన చేయకుండా సాగు చేపట్టిన రైతులపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. ఒకే ఒక్కరోజులోనే అధిక వర్షపాతం నమోదు కావడం.
ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరదలు రావడంతో వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. కండ్లముందే పంట గంగపాలు అవుతున్న తీరును చూసిన మున్నేటి పరిసర ప్రాంతాల రైతుల బాధలు అన్నీఇన్నీ కావు. జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలోనే భారీగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నాలుగురోజుల నుంచి గ్రామాల్లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు దెబ్బతిన్న పంటల సర్వే చేపడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం 33 శాతం కంటే ఎక్కువగా 68 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేశారు. సర్వే పూర్తయితే పంటనష్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం(10వ తేదీ సర్వే పూర్తి వరకు) జిల్లావ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 46,374 మంది రైతులకు చెందిన 68,345 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సుమారు రూ.68,34,50,000 నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో మరో రెండురోజులపాటు పంట నష్టం సర్వే కొనసాగే అవకాశం ఉంది. పంటల వారీగా విశ్లేషిస్తే పత్తి 16,727 మంది రైతులకు సంబంధించి 27,639 ఎకరాలు దెబ్బతినగా నష్టం రూ.27.63 కోట్లు,
మక్కసాగు 25 మంది రైతుల 47 ఎకరాలకు నష్టం రూ.4.70 కోట్లు, పెసర సాగు 292 మంది రైతుల 660 ఎకరాలకు నష్టం రూ.66 లక్షలు, వరి సాగు 26,607 మంది రైతుల 35,590 ఎకరాలకు నష్టం రూ.35.59 కోట్లు జరిగింది. మిర్చి తోటలు 2,532 మంది రైతుల 4,178 ఎకరాలకు నష్టం రూ.4.17 కోట్లు, కూరగాయల సాగు 155 మంది రైతుల 131 ఎకరాలకు నష్టం రూ.13.10 లక్షలు, అరటి సాగు 13 మంది రైతుల 68 ఎకరాలకు నష్టం రూ.3.20 లక్షలు, బొప్పాయి 23 మంది రైతులకు సంబంధించిన 68 ఎకరాలు దెబ్బతినగా.. రూ.6.80 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రెండు, మూడు రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి అయితే నష్టం విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఊరిముందుకు వచ్చి పొలాలను చూస్తే దుఃఖం వస్తున్నది. నలభై ఏండ్లలో ఏనాడు ఇంత పెద్దగా వరద రాలేదు. వచ్చినా నష్టం ఇంతగా జరగలేదు. వరద ఆగింది కాబట్టి మేం మిగిలాం. లేకపోతే ఆ వరదలోనే మా ఊరు కొట్టుకుపోయేది. నాకు ఏటి ఒడ్డున ఉన్న ఎకరంన్నర పొలంలో ఏమీ మిగలలేదు. దాదాపు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. వరద పోయిన తర్వాత నా పొలంతోపాటు చుట్టపక్కల చూస్తే ఏ ఒక్కరి పొలం మిగలకుండా పోయింది. సర్కార్ మా ఇబ్బందిని చూసి సాయం చేయాలి.
– బట్టు పెద్ద వెంకయ్య, రైతు, తనగంపాడు, ఖమ్మం రూరల్
పంటలు దెబ్బతిన్న పొలాలకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఆ పైసలు ఏ మూలకూ సరిపోవు. నాకు ఎకరం భూమి మాత్రమే ఉంది. దాదాపు అన్ని ఖర్చులు కలిపి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి రాకపోగా ఇప్పుడు ఆ పొలంలో ఇసుక మేట వేసింది. ఇసుక మేట తీసివేయాలంటేనే రూ.లక్ష పైగా ఖర్చు అవుతుంది. పంట పొలంతోపాటు అక్కడే డెయిరీ ఫాం కోసం షెడ్ వేసుకున్నాం. దళితబంధు పథకం ద్వారా మంజూరైన పెద్ద షెడ్ కూడా వరదలో కొట్టుకుపోయింది. పదివేలు కాకుండా నష్టాన్ని చూసి ప్రభుత్వం ఆదుకోవాలి.
– గుగ్గిళ్ల పెద్ద రాములు, రైతు, తనగంపాడు, ఖమ్మం రూరల్
వరదలు రావడం వల్ల మాకు దాదాపు రూ.2 లక్షల నష్టం జరిగింది. నాకు ఏడు ఎకరాల భూమి ఉంది, మూడు ఎకరాలు తనగంపాడు ఏరియాలో మిగిలింది గూడూరుపాడు పరిధిలో ఉంది. ఏటి ఒడ్డున ఉండడం ద్వారా వరద మొత్తం పంట భూమిలో నుంచి పోయింది. వరి పొలంతోపాటు పత్తి, మిర్చి తోట పనికిరాకుండా పోయింది. లక్షల రూపాయలు మిత్తికి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం.. పంట మొత్తం గంగపాలయ్యింది. ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆలోచన చేసి సాయం చేయాలి.
– మారుతి వెంకటప్పయ్య, గూడూరుపాడు, ఖమ్మం రూరల్