ఇల్లెందు, నవంబర్ 9 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వే అధికారులకు యజమానులు కుటుంబ వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఇల్లెందు పట్టణం జేకే కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే కొరకు మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు నిర్భయంగా వివరాలు చెప్పొచ్చన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కొరకు నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో జూలై నెలలో చేపట్టిన టీజీఐఎంఐడీసీ పనులను పరిశీలించిన కలెక్టర్.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో ధన్సింగ్, ఆర్ఐ కామేశ్ పాల్గొన్నారు.