కారేపల్లి, డిసెంబర్ 26 : ప్రజా సేవ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పలువురు ఉన్నత విద్యావంతులు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. చదువుల్లో రాణించిన వారు రాజకీయ పరీక్షల్లో ప్రజల ఆశీస్సులతో గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 17న ఖమ్మం జిల్లాలో జరిగిన మూడో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సింగరేణి(కారేపల్లి) మండలంలో గల 41 గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల పంచాయతీ పాలకవర్గాలు ఉన్నత చదువులు చదివిన విద్యావంతుల చేతుల్లోకి వెళ్లాయి. ఈసారి చాలామంది సర్పంచులు మొదటిసారి గెలిచి ఉన్నత భావాలతో పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముందుకు వచ్చారు. పల్లెలకు మంచి చేయాలన్న లక్ష్యంతో ఈ నెల 23న గ్రామ పంచాయతీ సర్పంచులు (ప్రథమ పౌరులు) గా ప్రమాణ స్వీకారం చేశారు.
వారిలో అప్పాయి గూడెం నుండి 1.దండు ప్రవీణ్ (బీటెక్-మెకానికల్), 2.గాదెపాడు.. భూక్య రంజిత్ కుమార్ (ఎంటెక్, బిఈడి), 3.గంగారంతండా.. నునావత్ కిరణ్ కుమార్ (ఇంటర్), 4.మాదారం.. అజ్మీర ఉమారాణి (బిఏ. బిఈడి), 5.నానునగర్ తండా.. మాలోత్ విజయ కుమారి (బిఈడి, డిఈడి), 6.పోలంపల్లి.. ధరావత్ హేమలత (ఎంబీఏ, ఎల్ఎల్బీ), 7.సింగరేణి.. మేదరి వీర ప్రతాప్ (ఎంబీఏ), 8.టేకులగూడెం.. గుమ్మడి సందీప్ (ఎంఏ.బిఈడి), 9.తొడిదలగూడెం..బానోత్ ప్రియాంక (బీఎస్సీ.బీఈడీ), 10.ఉసిరికాయలపల్లి.. గూగులోత్ వరలక్ష్మి (ఎంఎస్సీ.బీఈడీ) వీరితో పాటు ఇంకొంత మంది టెన్త్ ఆపై చదువులు చదివిన వారు సర్పంచులుగా ఎన్నికయ్యారు.