ఖమ్మం వ్యవసాయం, జూలై 20 : జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. కల్వర్టులు పొంగి వ్యర్థపు నీరు రోడ్లపై ప్రవహించింది. వర్షం ఎంతకూ తెరిపివ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సాయంత్రం కొంత ఒరుపివ్వడంతో రోడ్లపై జనసంచారం కనిపించింది. సత్తుపల్లి, మధిర, పాలేరు, వైరా నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో పత్తి, మొక్కజొన్న, ఇతర అపరాల పంటల సాగు పనులు జోరందుకున్నాయి. ప్రస్తుత వర్షాలతో అన్నదాతలు పొలాలు దమ్ము చేసుకుంటున్నారు.
ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్న రైతులకు ప్రస్తుత వర్షం ఊరటనిచ్చినైట్లెంది. నిన్న మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన మున్నేరు వాగు కొత్త నీటితో జలకళను సంతరించుకుంది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు పూర్తిగా నిండి అలుగుపోసింది. వేంసూరు, పెనుబల్లి, కల్లూరు మండలాల్లోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. గత ఏడాది నుంచి నీటి నిల్వలు లేక ఎండిపోయిన అనేక చెరువులు, కుంటలకు వరద నీరు వచ్చి చేరుతోంది. పాలేరు, వైరా రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతోంది. సత్తుపల్లిలోని ఓపెన్ కాస్టులో వరదలతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
గడిచిన 24 గంటల్లో(శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు) జిల్లావ్యాప్తంగా 49.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 79.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కామేపల్లి 76 మి.మీ, సింగరేణి 68.8 మి.మీ, పెనుబల్లి 62.2 మి.మీ, తిరుమలాయపాలెం 54 మి.మీ, చింతకాని 51.8 మి.మీ, కల్లూరు 58 మి.మీ, సత్తుపల్లి 61.6 మి.మీ, మధిర 55 మి.మీ, తల్లాడ 48 మి.మీ, ఖమ్మం అర్బన్ 46 మి.మీ, రఘునాథపాలెం 45.2 మి.మీ, ఖమ్మం రూరల్ 48.2 మి.మీ, ముదిగొండ 42.4 మి.మీ, వైరా 44.4 మి.మీ, ఇతర మండలాల్లో మరో 30-40 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 6-12 సెంటీ మీటర్ల వర్షపాతం 3 మండలాల్లో నమోదు కాగా.. 3-6 సెంటీ మీటర్ల వర్షపాతం మరో 10 మండలాల్లో నమోదైంది.
విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అపరాలు, వాణిజ్య పంటల సాగు పనులు ప్రారంభం కాగా, ప్రస్తుత వర్షాలతో వరినాట్లు ముమ్మరమయ్యాయి. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా శనివారం వరకు 2,87 336 ఎకరాల్లో సాగు పనులు చేపట్టారు. పంటలవారీగా పరిశీలిస్తే.. పత్తి సాగు 1,84 857 ఎకరాలు, వరి 51,771 ఎకరాలు, కంది 236 ఎకరాలు, మక్క 1,572 ఎకరాలు, పెసర 13,250 ఎకరాలు, పచ్చరొట్ట సాగు మరో 32 వేల ఎకరాల్లో సాగు చేశారు.
సత్తుపల్లి/పెనుబల్లి, జూలై 20 : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కల్లూరు డివిజన్లో భారీ వర్షపాతం నమోదుకాగా.. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతోంది. వరి పొలాల్లోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు సింగరేణి జీవీఆర్ ఓసీలో 30 వేల టన్నుల బొగ్గు, 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల బొగ్గు వెలికితీతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సింగరేణి బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి.
బొగ్గు గనుల్లో నీటిని వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ మధ్యతరహా ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతంగా చేరుతోంది. దీంతో అలుగు పైకి నీరు పొర్లుతూ పారుతోంది. దూర ప్రాంతాల నుంచి పొలాల్లోకి చేరిన వరద ప్రాజెక్టులోకి చేరడంతో కనుచూపు మేర నీటి ప్రవాహం ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఆయా గ్రామాల ప్రజలు ప్రాజెక్టును చూసేందుకు తరలివస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ తగు సూచనలు సలహాలు చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వరద నీరు కొనసాగితే ప్రాజెక్టు నుంచి నీరు తూముల ద్వారా ఎత్తే అవకాశం ఉంది.