– అర్థగంట వ్యవధిలోనే 89.5 మిల్లీమీటర్ల వర్షపాతం
ఖమ్మం రూరల్, అక్టోబర్ 04 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, వాయుగుండం ఎఫెక్ట్ శనివారం ఖమ్మం రూరల్ మండలంలో స్పష్టంగా కనపడింది. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించింది. ఆ వెంటనే దట్టమైన మేఘాలు అలుముకోవడం, కాసేపటికి భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో అనేక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం కాసేపు పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచి ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన మండల వాసులకు సాయంత్రం వేళ కురిసిన భారీ వర్షంతో ఉపశమనం కలిగింది.
అయితే భారీ వర్షం పట్ల పత్తి, మిరప తోటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని రైతులు వాపోయారు. ఆయా గ్రామాల్లో వరి పొలాలు ఇప్పుడిప్పుడే ఈనే దశకు రావడంతో భారీగా వీచిన గాలి దుమారానికి వరి పొలాలు నేలవాలిపోయే అవకాశం ఉందని సాగు రైతులు ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వర్షం కురవడంతో మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థులు, వివిధ పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాల్లో నిలిచిన వరద నీరును తొలగించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
Khammam Rural : ఖమ్మం రూరల్లో దంచికొట్టిన వాన