ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 30 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఖమ్మం జిల్లాపై శుక్రవారం స్పష్టంగా కన్పించింది. ఉదయం నుంచి కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కన్పించింది. ఖమ్మం నియోజకవర్గంలో దట్టమైన మేఘాలు అలుముకోవడంతోపాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
ఖమ్మం నగరంలో దాదాపు 30 నిమిషాలపాటు భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఖమ్మంలోని ప్రధాన సెంటర్లలో నాలాలు పొంగడంతో రోడ్లమీద వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు యాతన పడ్డారు. అలాగే, జిల్లాలోని పలు మండలాల నుంచి వివిధ పనుల నిమిత్తం ఖమ్మానికి వచ్చిన ప్రజలు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అలాగే, ఖమ్మం నగరంతోపాటు శివారు ప్రాంతాలైన చింతకాని, రఘునాపథపాలెం, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. కాగా, ప్రస్తుతం వానకాలంలో సాగు చేస్తున్న వరి, పత్తి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసింది. మిర్చి తోటలు సాగుచేసే రైతులకు కలిసివచ్చినట్లయింది. అలాగే, మరో రెండు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించిన విషయం విదితమే.