రఘునాథపాలెం, సెప్టెంబర్ 14: ఖమ్మం జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉద యం ఉక్కపోతగా ఉండగా మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో భారీ వర్షం పడింది. పలు చోట్ల ఏకధాటిగా గంటల కొద్దీ కురిసిన వర్షానికి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులకు అవస్థలు తప్పలేదు. ఖమ్మం నగరంలోని డ్రైనేజీలు పొంగి పొర్లి మురుగునీరు రోడ్లపైకి చేరింది.
దీంతో వాహనదారులు ఇబ్బందు లు పడ్డారు. భారీ వర్షంతో నగరంలో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో పనులకు వెళ్లాల్సిన ప్రజలు వాన కోట్లు, గొడుగులతో అడుగు బయట పెట్టారు. ప్రయాణం మధ్యలో ఉన్న దిచక్రవాహనదారులు తడిచి ముద్దయ్యారు. ఇంకొంతమంది వర్షంలో తడుస్తూనే పనులకు వెళ్లారు.
వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర పంటనష్టాన్ని చూ సిన అన్నదాతలు.. ఇప్పుడు మళ్లీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత ఆందోళన చెందుతున్నారు. నీట మునిగిన పంటలు ఇప్పుడిప్పుడే తడారుతున్నాయనుకుంటే మళ్లీ కురుస్తున్న వర్షాలకు దిగాలు చెందుతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.