ఖమ్మం, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షం కుంభవృష్టిని తలపించింది. బుధవారం ఉదయం వర్షం గురువారం మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఏర్లు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. కొన్ని మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారుల మీద నుంచి కూడా వరద ప్రవహించడంతో ట్రాఫిక్ స్తంభించింది.
భద్రాచలం వద్ద గోదావరి వరద మరోసారి పెరిగింది. ఇటీవలే 52.90 అడుగుల వరకు ప్రవహించి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువైన వరద.. గురువారం సాయంత్రం 6 గంటలకు 38.60 వద్ద ప్రవహిస్తోంది. గంటగంటకూ గోదావరి వరద పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి 10 గంటలకు 37.50 అడుగులకు చేరింది. రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అధికారులు చెబుతున్నారు. పర్ణశాల సీతవాగు పొంగడంతో నార చీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది.
గోదావరి ముంపు గ్రామమైన సున్నంబట్టికి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వైరా మండలం అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు వరదల్లో చిక్కుకోవడంతో వైరా తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సక్రియ, ఇతర అధికారులతో కలిసి ట్రాక్టర్ సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 15 గేట్లు ఎత్తి 22,627 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మధ్యతరహా ప్రాజెక్టు లంకాసాగర్ సామర్థ్యం 16.4 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 16.8 అడుగులకు నీరు చేరి 4 అంగుళాల పైనుంచి వరద ప్రవహిస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 404.50 అడుగులుగా ఉంది.
సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఓసీల్లో భారీగా వరదనీరు చేరడంతో భారీ యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి తీసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా అధికారులు యార్డు కోల్‌ను రవాణా చేస్తున్నారు. యార్డు కోల్‌ను రవాణా చేసినప్పటికీ రోజువారీ రవాణాలో సగానికంటే తక్కువ బొగ్గు రవాణా జరిగింది. అత్యధికంగా పెనుబల్లిలో 105.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.