రఘునాథపాలెం/ కారేపల్లి/ తిరుమలాయపాలెం, మే 1: ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి తోటలు విరిగిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రఘునాథపాలెం మండలంలో బొప్పాయి తోటలు నేలవాలాయి. సూర్యాతండాలో రైతులు సాగు చేసిన బొప్పాయి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
రైతు వాంకుడోతు బాలకు చెందిన సుమారు పది ఎకరాల బొప్పాయి తోట పూర్తిగా నేలకొరిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. కారేపల్లి క్రాస్రోడ్లో భూక్యా శంకర్ ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసిన బోప్పాయి తోట గాలివాన బీభత్సానికి నేలకొరిగింది. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు శంకర్ వాపోయాడు. మండలంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వరి, మొక్కజొన్న, మిరప తోటలు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తిరుమలాయపాలెం మండలం బచ్చోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పట్టాలు లేకపోవడంతో ధాన్యపు రాసులు తడిచిముద్దయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల రైతులు సుమారు 3,500 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి తెచ్చారు. 15 రోజులు గడుస్తున్నా వడ్లు కొనేవారు లేరని రైతులు వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిచిపోయి రైతులు నష్టపోయారని సీపీఐ(ఎంఎల్) న్యూడమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేశ్ తెలిపారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.