రఘునాథపాలెం, జూన్ 28: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం కురిసిన వానకు ఉపశమనం పొందారు. భారీగా గాలులు వీచడంతో అనేకచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం నగరం పాత బస్టాండ్ వద్ద డ్రైనేజీలు నిండి వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో ప్రధాన రోడ్డు చెరువులను తలపించాయి.
వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. మయూరిసెంటర్ నుంచి వినోద్ థియేటర్ వైపు వరద ముంచెత్తింది. వానకాలం సీజన్ ప్రారంభమై వ్యవసాయ సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నా.. సరైన వర్షాలు లేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. పత్తి రైతులు విత్తనాలు పెట్టి వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా వర్షాలు కురవకపోతే నష్టాలను చవిచూడాల్సిందేనని రైతులు భయాందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం కురిసిన జోరు వాన అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. సరిపోయేంత వానలు కురిసి కాలం కావాలని, వాగుల్లో నీరు నిండాలని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.
పిడుగు పడి యువకుడు మృతి
అశ్వారావుపేట రూరల్, జూన్ 28: పిడుగు పడి యువకుడు మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గాడ్రాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నందిపాడు పంచాయతీలోని గాడ్రాల గ్రామానికి చెందిన జెడ్డి మంగయ్యకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు జెడ్డి డేవిడ్ (20) తమ చేనులో పనిచేస్తున్న క్రమంలో ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో చెట్టు కిందకు వెళ్లిన డేవిడ్‌పై పిడుగుపడి అక్కడిక్కడే మృతిచెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.