ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 8: ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పెట్లో విలవిల్లాడుతోంది. వారం రోజుల కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కుంభవృష్టిని తలపించేలా ఖమ్మం జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
ఎగువన నుంచి వస్తున్న వరద కారణంగా ఖమ్మం మున్నేరు ప్రవాహం శనివారం రాత్రే మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. దీంతో అధికారులు అప్రమత్తమై దాని పరీవాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. మైకులతో ప్రజలను అప్రమత్తం చేస్తూ వెంటనే ముంపు ప్రాంతం నుంచి ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు కూడా ముందస్తు పర్యటనలు రద్దు చేసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరుకు మరోసారి ప్రమాదం పొంచి ఉందని తెలియడంతో డిప్యూటీ సీఎం భట్టి హుటాహుటిన శనివారం రాత్రి ఖమ్మానికి వచ్చారు.
ఆ రాత్రంతా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ధంసలాపురంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హైదరాబాద్ నుంచి హుటాహుటిన వచ్చి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మంలోనే మకాం వేసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎలాంటి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికార యత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుని మురుగును శుభ్రం చేసుకుంటున్న ముంపు ప్రాంతాల ప్రజలు తాజా వర్షాలతో మరోసారి భయాందోళన చెందుతున్నారు.
మరోసారి భారీ వర్షాలు వచ్చిన ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కానీ భారీ వర్షాలు, వరదల సమాచారంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. మున్నేరు ముంపు ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు ఇప్పటికీ పెద్దగా ప్రభుత్వం సాయం అందకపోవడంతో స్వచ్ఛంద సంస్థల బాధ్యులే ఇంకా ఆహార పొట్టాలు, నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. బీఆర్ఎస్ సాయమూ అందుతోంది. సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు పంపిన సరుకులను కూడా పార్టీ శ్రేణులు.. నిర్వాసితులకు అందజేస్తున్నాయి. మున్నేరు ముంపు ప్రాంతాలైన కాల్వొడ్డు,
బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ధంసలాపురం, రాజీవ్‌గృహకల్ప, దానవాయిగూడెం, కాలనీల్లోని ప్రజలను ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో పలు బృందాల అధికారులు శనివారం అర్ధరాత్రే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కందగంట్ల ఫంక్షన్ హాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల వరకు మున్నేరు వరద 16 అడుగులకు చేరుకుంది. ఆ తరువాత నిలకడగా ఉంది. ఆదివారం సాయంత్రం వరకు పెరగకపోవడంతో అటు అధికారులు, ఇటు ముంపు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రాత్రంతా ముంపు ప్రాంతాల్లోనే కలెక్టర్, సీపీ మున్నేరు పరీవాహకంలో వారం క్రితం జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన అధికారులు.. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్, సీసీ సహా అధికారులందరూ శనివారం మధ్యాహ్పం నుంచే రంగంలోకి దిగారు. కలెక్టర్, సీపీ రాత్రంతా ముంపు ప్రాంతాల్లోనే పర్యటించారు.
ఖమ్మం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఆదివారం రోజంతా వర్షం కురిసింది. మున్నేరు ప్రాంతంతోపాటు పలు గ్రామాల్లో వరద సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం – చండ్రుగొండ మార్గంలో ఎద్దుళ్లవాగు బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో సీతాయిగూడెం వైపు వెళ్లకుంగా ట్రాక్టర్ ట్యాంకర్ అడ్డుగా పెట్టారు. చిలుకూరు వద్ద వైరా నది ప్రవాహం పెరగడంతో తెలంగాణ నుంచి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు రాకపోకలను నిలిపివేశారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ వర్షం కారణంగా కట్టగూడెం
– అబ్బుగూడెం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం ధంసలాపురం, ఖమ్మం రూరల్ మండలం రాజీవ్‌గృహకల్ప, తిరుమలాయపాలెం మండలం రాకాసితండాల్లోని మున్నేరు ప్రభావిత ప్రాంతాలను సరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరొసా ఇచ్చారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు.
భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడలో రికార్డు స్థాయిలో 126.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం నగరంలో కురిసిన వర్షానికి అనేక ప్రధాన వీధులు జలమయ్యాయి. ఖమ్మం నుంచి మంగళగూడెం వెళ్లే ప్రధాన రహదారిలోని తీర్థాల లోలెవల్ బ్రిడ్జి కొట్టుకపోయింది. ముల్కలపల్లి ప్రాంతంలో అకేరువాగుపై ప్రధాన వంతెన ఇప్పటికే కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
చింతకాని మండలం నామవరం -మోత్కెపల్లి వద్ద వాగు పొంగి ప్రవహించింది. పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం రికార్డు స్థాయికి చేరింది. కొణిజర్ల మండలంలో పగడేరు వాగు పొంగడగంతో తీగలబంజర – ఏన్కూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు పంటలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జిల్లాలో 69 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నాలుగు రోజుల క్రితమే వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. తాజా వర్షాలతో ఈ నష్టం మరింత పెరిగే ప్రమాదముంది.
భద్రాద్రికి మళ్లీ వర్షం ముప్పు తాకింది. శనివారం రాత్రి నుంచి దాదాపు అన్ని మండలాల్లో వర్షం దంచి కొట్టింది. అత్యధికంగా అన్నపురెడ్డిపల్లిలో 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అశ్వారావుపేటలో ఇళ్లమధ్యలోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల పంటలు కూడా దెబతింటున్నాయి. ఇక కిన్నెరసాని ప్రాజెక్టులోకి 5 వేల క్యూసెక్కుల నీరు ఉంది. మరింత పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉంది. తాలిపేరులో కూడా 12,593 క్యూసెక్కుల వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా పెరుగుతోంది. మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ భద్రాద్రి కలెక్టర్ జితేశ్ సూచించారు. వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. గణేశ్ నిమజ్ఞననానికి వెళ్లేవారు ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కూసుమంచి, సెప్టెంబర్ 8: ఎగువన వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లీ వరద రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 21 అడుగులు ఉన్న నీటిమట్టం ఈ వరదతో 21.5 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా అదే తరహాలో నీటిని దిగువకు వదిలారు. మిషన్ భగీరథకు 135 క్యూసెక్కులను వదులుతున్నారు. పాత కాలువకు గండి పడడంతో నీటిని నిలుపుదల చేశారు. పాలేరు అలుగుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆటోమేటిక్ గేట్ల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు.
ప్రత్యేక రైలులో ఆదివారం ఖమ్మం చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం తప్పక సహాయం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఎదుట వరద బాధితులు ఆందోళన చేశారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని వాపోయారు. అయితే, రాష్ట్ర మంత్రి పొంగులేటి నచ్చచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 8: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజులుగా నిలకడగా ఉన్న గోదావరి వరద.. ఆదివారం సాయంత్రానికి క్రమంగా పెరిగింది. రెండు రోజుల క్రితం 23 అడుగులు వద్ద ఉన్న నీటిమట్టం ఆదివారం సాయంత్రం 28 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వరద కారణంగా ఆదివారం రాత్రికి ప్రవాహం కొద్దిమేర పెరిగే అవకాశం ఉందని సీబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.