ఖమ్మం రూరల్, ఏప్రిల్ 06 : విద్యా సంస్ధలలో చదివే ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి హెల్త్ కార్డు రూపొందించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం ఖమ్మం రూరల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలలో తిరుగుతూ మౌళిక సదుపాయాలు, వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు, స్టోర్ రూమ్లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేసి, రికార్డు రిజిష్టర్లను పరిశీలించారు. కామన్ మెనూ ప్రకారం సోమవారం విద్యార్థు లకు అందించడానికి సిద్ధం చేస్తున్న అన్నం, కూరలను పరిశీలించారు. పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని, కావాలసిన ప్రహరీ గోడ, డైనింగ్ హాల్ మరమ్మతులకు ప్రతిపాదనలు అందించాలని, మంజూరైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల ప్రత్యేక అధికారులు ప్రతివారం తమ పరిధిలో ఉన్న కేజీబీవీ, గురుకులం, ప్రభుత్వ విద్యా సంస్థలను తనిఖీ చేసి అక్కడ ఉన్న వసతులు, భోజన నాణ్యత పర్యవేక్షించాలని అన్నారు. గురుకులాలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలను ఆర్.బీ.ఎస్.కే. ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి డిజిటల్ హెల్త్ కార్డు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. గురుకులంలో విద్యార్థులకు ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఆహారం అందించాలన్నారు. వంట సిబ్బంది అందించే ఆహారంతో మంచి ఆరోగ్యంతో విద్యార్ధులు చదువుపై దృష్టి పెడతారని వివరించారు.

ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలతో హెల్త్ కార్డు రూపొందించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వంట సిబ్బంది శుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రభుత్వం అమలు చేసే మెనూ ప్రణాళిక పద్దతులు ద్వారా భోజన నాణ్యతను మరింత మెరుగుపరచాలని స్పష్టం చేశారు. విద్యార్దులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ పదవతరగతి పరీక్షలలో వందశాతం ఫలితాలు వచ్చే విధంగా చొరవ చూపాలని, ప్రత్యేక విద్యా క్లాసుల ద్వారా శిక్షణ ఇస్తూ పోటీ ప్రవేశ పరీక్షలకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేసి వాటిలో మంచి ర్యాంకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పరిసరాలతో పాటు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, విద్యార్ధులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులకు మంజూరు అయిన నిధులతో కేటాయించిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెండర్ ఈక్విటీ కో ఆర్డినేటర్ రూబీ, ఖమ్మం రూరల్ కెజిబివి స్పెషలాఫీసర్ ఆసియా బేగం, విద్యాశాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.