ఖమ్మం రూరల్, ఏప్రిల్ 6: ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్‌కార్డును రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మంరూరల్ కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాల్లో తిరుగుతూ మౌలిక సదుపాయాలు, వంటగది, స్టోర్‌రూం, ఇతర నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, రిజిస్టార్స్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు.
పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని, ప్రహరీ, డైనింగ్‌హాల్ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతివారం తమ పరిధిలో ఉన్న కేజీబీవీ, గురుకులం, ప్రభుత్వ విద్యాసంస్థలను అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలు, బీఆర్ఎస్కే ద్వార వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌కార్డు ప్రొఫైల్ తయారు చేయాలన్నారు. గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఆహారం అందించాలన్నారు.
వంటగది శుభ్రత, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందిస్తూ పదో తరగతి పరీక్షలో వందశాతం ఫలితాలు వచ్చే విధంగా చొరవ చూపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ రూబీ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఆయేషాబేగం, విద్యా, మున్సిపల్, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.