టేకులపల్లి, ఫిబ్రవరి 17: ఇంటికొచ్చిన అల్లుడిపై అతడి అత్త, మామ, బావమరుదులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతడు.. ఆస్పత్రిలో మృతిచెందాడు. బోడు ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు-అనురాధ దంపతుల కుమార్తె కావ్య, పాల్వంచ మండలం దంతాలబోరు గ్రామానికి చెందిన బల్లెం గౌతమ్(24) మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గౌతమ్, సుజాతనగర్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
గౌతమ్-కావ్య దంపతులు అక్కడే నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. ఈ దంపతులు ఐదు నెలల క్రితం గొడవ పడ్డారు. అప్పటి నుంచి కావ్య, పిల్లలతో కలిసి తన పుట్టింటిలో ఉంటున్నది. వాళ్లను చూసేందుకని ఈ నెల 2న అత్తారింటికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో గౌతమ్ వెళ్లాడు. అతడిని అత్త, మామ, బావమరుదులు అడ్డుకున్నారు. వారి మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన కావ్య తల్లిదండ్రులు, సోదరులు కలిసి గౌతమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటలు తాళలేని గౌతమ్, పక్కనే ఉన్న నీటి తొట్టిలోకి దూకాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న (గౌతమ్) కుటుంబ సభ్యులు.. అతడిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనతో ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అతడు అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఇతడు ఆస్పత్రిలో ఉన్నప్పుడే, తండ్రి బల్లెం వెంకటేశ్వర్లు ఈ నెల 11న బోడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.