రఘునాథపాలెం, జూలై 30: ‘రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తావా? విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తావా?’ అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి నేత రాకేశ్దత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఖమ్మం నగరంలో విద్యార్థులు ఆర్డీవో ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.
ముందుగా ఖమ్మం కాల్వొడ్డు నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు విద్యార్థులు ప్లకార్డులను చేబూని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్దత్త మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను జారీ చేయడంలేదన్నారు. సర్టిఫికెట్లు కావాలంటే ఫీజులు కడితేనే ఇస్తున్నారని, తద్వారా పేద విద్యార్థులు ఫీజులు కట్టే ఆర్థిక పరిస్థితి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధమవువుతామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఆందోళనలో భాగంగా విద్యార్థులు ఆర్డీవో ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయ త్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి బాషబోయిన ఉపేందర్, టౌన్ అధ్యక్షుడు శీలం ఉపేందర్, విద్యార్థి సంఘం నాయకులు ఆర్ ధర్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శాసనాల సాయిరాం, శ్యాం, సాయి, హర్షిత్, కావేరి తదితరులు పాల్గొన్నారు.