ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 6 : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సేవా నిరతి పట్ల యావత్ ఖమ్మంజిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన మరుసటి రోజే హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎంపీలు కదలివచ్చి ధైర్యం చెప్పిన తీరుపట్ల ఖమ్మంరూరల్ వరద బాధితులు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. ఓపెన్‌టాప్ జీప్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్లపోయాడని.., అదే హరీశ్‌రావు బురదమట్టి, ఒండుమట్టి అని చూడకుండా ఇండ్లల్లోకి వచ్చి జరిగిన తీరు తెలుసుకోవడం, ప్రభుత్వంతో కొట్లాడి న్యాయం జరిగే వరకు మీ వెంట ఉంటామని పదిమంది ముందు చెప్పిన మాటలను నేటికీ ముంపు బాధితులు నెమరవేసుకుంటున్నారు.
మరుసటి రోజు నుంచే ప్రభుత్వంలో చలనం రావడంతోనే ఈ మాత్రం సేవలు అందుతున్నాయని వారు పేర్కొంటున్నారు. అయితే రెండు రోజులు గడవక ముందే సాక్షాత్తూ అదే నాయకుడు హరీశ్‌రావు ఒక్కటి కాదు రెండు కాదు ఆరు లారీల్లో వరద బాధితులకు సరుకులు ఖమ్మం పంపుతుండని తెలిసి యావత్ జిల్లా ప్రజలు హరీశ్‌రావు కమిట్మెంట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే గురువారం రాత్రికి ఖమ్మం చేరుకున్న నిత్యావసర కిట్లు శుక్రవారం నుంచి బాధితుల ఇంటికి చేరాయి.
శుక్రవారం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, మాజీ ఎంపీపీ బెల్లం ఉమ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మండలంలోనీ తీర్ధాల గ్రామంలో శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించారు. 5కిలోల బియ్యంతోపాటు 16రకాల వంట సామగ్రిని బాధిత కుటుంబాలకు అందజేశారు. తొలిరోజు గ్రామంలో 192 కుటుంబాలకు చేరవేశారు. ఒకవైపు ఆకేరు, మరోవైపు మున్నేరు నడుమ ఉన్న తీర్ధాల గ్రామంలో ఇంట్లో ఆస్తినష్టం, బయట పంటనష్టం వాటిల్లడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గడిచిన నాలుగురోజుల నుంచి ప్రభుత్వం నుంచి వివరాల సేకరణతోపాటు నామమాత్రంగానే సరుకులు పంపిణీ చేశారని బాధితులు వాపోతున్నారు.
ఈ పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే కందాల సహకారానికి తోడు హరీశ్‌రావు పంపిణీ కిట్లతో కొంతమేర తీర్ధాల ప్రజలు ఉపశమనం పొందారు. మెజార్టీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో కనీసం పారిశుధ్యం నివారణ పనులను సైతం చేయని పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని గుర్తించి ఈ సహాయం అందించిన బీఆర్ఎస్ నాయకులకు వారు ప్రత్యేక కృజజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుడా మాజీ డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ లక్ష్మణ్‌నాయక్, మాజీ సర్పంచ్ బాలూనాయక్ పాల్గొన్నారు.