భద్రాద్రి కొత్తగూడెం/ కొత్తగూడెం సింగరేణి, జూన్ 23 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన సింగరేణి పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో లాభాల బాటలో ఉన్న సింగరేణి.. కాంగ్రెస్ పాలనలో నష్టాల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారి ఎక్సెస్ టెండర్లను దక్కించుకున్నది సీఎం బావమరిదేనని ఆరోపించారు. సింగరేణిని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. ప్రతి టెండర్లలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సింగరేణిని నష్టాల్లో ఉంచిందన్నారు. అందుకే బొగ్గు లేకున్నా రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు.
నాడు సిరుల గనిగా ఉన్న సింగరేణి నేడు కుంభకోనాల ఖనిగా తయారైందని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ జోక్యం వల్ల అధికారులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో ఇద్దరు అధికారులు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆట కోసం సీఎస్ఆర్ నిధులు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి కార్మికుల కష్టాన్ని వృథా చేశారని అన్నారు. సోలార్ స్కాం, డీజిల్ స్కాం, ఎక్స్‌ప్లోరేషన్‌లో స్కాంలతోపాటు మెడికల్ బోర్డు పెట్టకుండా కార్మికుల పొట్టకొట్టారని ఆరోపించారు. కొత్తగూడెం ఏరియాకు వెళ్లి బొగ్గు నిల్వలు చూస్తే అర్థం అవుతుందన్నారు. బొగ్గు నిల్వలు చూడటానికి వెళ్తే పోలీసులను పెట్టి అడ్డుకున్నారంటే ఎంత అవినీతి జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదని అన్నారు. కార్మికుల డబ్బులు వృథా చేసి కమీషన్ల కోసం నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
సింగరేణిలో దోపిడీని అరికట్టాలంటే కార్మికులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రతి బొగ్గుబావిలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. చరిత్రలో కార్మికులు ధర్నాలు చేయడం చూశాం కానీ అధికారులు ర్యాలీలు చేయడం చూశామా అని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని బొగ్గు నిల్వల గురించి మాట్లాడుతున్నారని, ఎక్కడ ఉన్నాయో చూపెట్టాలని అన్నారు. కార్మికుల పక్షాన ఉండాల్సింది పోయి కాంగ్రెస్‌తో జతకట్టి కార్మికులకు అన్యాయం చేస్తే కార్మికులే బుద్ధి చెపుతారని అన్నారు. బొగ్గు స్కాములకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, బీఆర్ఎస్ నేతలు ఏనుగుల రాకేష్‌రెడ్డి, దిండిగల రాజేందర్, సీతాలక్ష్మి, కార్పొరేటర్లు సింధు, గుణచరిత, మధుచంద్, వీరమ్మ, సాగర్, మల్లెల రవిచంద్ర, దామోదర్, బాదావత్ శాంతి, సోనా, కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.
137 ఏళ్ల సింగరేణి చరిత్రలో రూ.1,600 కోట్ల బొగ్గుమాయమవడం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు. రికార్డుల్లో బొగ్గు ఉన్నా బావుల వద్ద నిల్వలు లేవన్నారు. అందుకే థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయలేకపోతున్నదన్నారు. తవ్వని బొగ్గును కూడా తవ్వినట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. మాయమైన బొగ్గుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.