రఘునాథపాలెం, నవంబర్ 26: కేంద్ర సర్కారు తొలగించిన కిరోసిన్ హాకర్లను తెలంగాణ సర్కారు ఆదిరించింది. కేంద్రం తీరుతో జీవనోపాధి కోల్పోయి వీధినపడ్డ కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ప్రత్యేక జీవో ద్వారా వారిని రేషన్ డీలర్లుగా నియమించింది. ఖమ్మంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆ జీవోను పక్కాగా అమలు చేస్తూ కిరోసిన్ హాకర్లను రేషన్ డీలర్లుగా నియమించేందుకు కృషి చేస్తున్నారు.
ఇప్పటికే ఏడుగురు హాకర్లు డీలర్లుగా నియమితులై రేషన్ పంపిణీని చేపడుతుండగా.. తాజాగా ఖమ్మం అర్బన్ పరిధిలో మరో ముగ్గురికి నియామక పత్రాలను శనివారం మంత్రి అజయ్ తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. జాతీయ కిరోసిన్ పంపిణీ పథకం ద్వారా 40 ఏళ్లుగా కిరోసిన్ హాకర్లు ప్రభుత్వం అందించే కిరోసిన్‌ను పేదలకు సబ్సిడీపై సరఫరా చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 2018లో కేంద్రం ఉజ్వల పథకం పేరుతో పేదలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకం తెచ్చాక సబ్సిడీ కిరోసిన్ సరఫరాను కేంద్రం నిలిపి వేయడంతో ఆ కిరోసిన్ పంపిణీ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న హాకర్ల బతుకులు వీధినపడ్డాయి. దీనిపై హాకర్లు అనేకమార్లు కేంద్రానికి విన్నవించుకున్నా, పలుమార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది.
అయితే హాకర్ల దీనస్థితిని గుర్తించిన తెలంగాణ సర్కార్.. వారి సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంది. 7వ తరగతి చదువుకున్న కిరోసిన్ హాకర్లను రేషన్ డీలర్లుగా నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 20ని తీసుకొచ్చారు. హాకర్లందరినీ విడతల వారీగా రేషన్ డీలర్లుగా నియమిస్తుండడంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. డీలర్లుగా నియమించేందుకు కృషిచేసిన మంత్రి పువ్వాడకు, సహకరించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాటూరి లక్ష్మీనారాయణ, మైనారిటీ సెల్ నాయకుడు షేక్ జానీమియాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.