ఇల్లెందు, సెప్టెంబర్ 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లెందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పట్టణంలోని జెకె కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్భంగా గుర్రం రాజేష్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని పిఎసిఎస్ వద్ద యూరియా అందక ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని ఈనెల11న అడిగి తెలుసుకుంటున్న సాంబశివరావును పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఎలాంటి వివాదం లేనప్పటికీ టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు, జిల్లా కెమెరామెన్ నాగరాజు, టెక్నికల్ బాధ్యునిపై కేసులు బనాయించడం దారుణం అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న మంచిని, తప్పులను ఎత్తిచూపుతూ వార్తలు ప్రసారం చేయడం సర్వసాధారణమే అన్నారు. అయినప్పటికీ ఆ విషయాలను మరిచిన పాలకులు జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ నాయకులు రాజశేఖర్, సంతోష్, డానియల్, రాధాకృష్ణ, నందు, వీరన్న, రవి, శివ, విజ్ఞాన్ తదితరులు ఉన్నారు.