ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు రోజురోజుకూ దిగువకు పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు చాలావరకు ఎండిపోయే స్థితికి వచ్చేశాయి. చేలల్లో బోర్లు సైతం రెండున్నర అంగుళాల దార పోసేవి అరంగులమే పోస్తున్నవి. దీంతో యాసంగి పంటలకు నీరు అందడం లేదు. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. రైతులు ఇంజిన్లు పెట్టి చెరువుల్లో ఉన్న కాస్త నీటిని తోడుకొని మరీ పంటలను కాపాడుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా కొన్ని మండలాల్లో సాగునీటి సమస్య రైతుల్ని తీవ్రంగా వేధిస్తున్నది. విద్యుత్ సరఫరాలో సైతం తీవ్ర అంతరాయం కలుగుతుండడం, రాత్రులు త్రీఫేజ్ కరెంట్ లేకపోవడంతో అన్నదాతలు మరింత ఆవేదన చెందుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 17 (నమస్తే తెలంగాణ)
వానకాలంలో పంటలకు సరిపడా వర్షపాతం నమోదైనప్పటికీ ఈ వేసవిలో భూగర్భ జలం మాత్రం భారీగా తగ్గిపోయింది. 2024-25 సంవత్సరంలో సాధారణ వర్షపాతం 1,198 మిల్లీమీటర్లు కాగా.. 1,752 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే 46 శాతం అదనంగా వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ.. గత ఏడాది ఫిబ్రవరిలో 8.66 మీటర్లలో భూగర్భ నీటిమట్టం ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.45 మీటర్ల లోతుకు దిగిపోయింది. జనవరిలో ఈ ఏడాది 8.55 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రెండు నెలల్లో 2.57 మిల్లీమీటర్ల భూగర్భ జలం తగ్గినట్లు భూగర్భ శాఖ అధికారులు చెబుతున్నారు.
మార్చిలోనే ఇలాంటి ఎండలు ఉండడం చూస్తుంటే రానురాను భూమిలోని జలం మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ఇప్పటికే 1.16 లక్షల ఎకరాల్లో పంటలను వేసినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వరితోపాటు మొక్కజొన్న పంటలకు కూడా తడి అందకపోవడంతో ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు.
ఆళ్లపల్లి మండలం మర్కోడు చెరువులో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టేకులపల్లి చెరువులో నీరు ఉన్నా పొలాలకు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో బోరులో అరంగుళం మాత్రమే నీరు వస్తుండడంతో వరి ఎండిపోతున్నది. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో నీరు ఉన్నా చేపల పెంపకం వల్ల కాలువల్లోకి వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు కరెంటు కోతలు రైతుల్ని పట్టిపీడిస్తున్నది మరో సమస్యగా మారింది. రాత్రుల సమయంలో త్రీఫేజ్ కరెంటు ఇవ్వకపోవడంతో మోటర్లు నడిచే పరిస్థితి లేకుండాపోయింది.
భూగర్భ జలాలు తగ్గకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధిహామీ ద్వారా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సైతం రైతులు ఫాం పాండ్లు నిర్మించుకోవాలని, ప్రతి గ్రామంలో యుద్ధప్రాతిపదికన ఇంకుడు గుంత తవ్వాలని ఒకరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీలో స్థానిక యువతతో కలిసి కలెక్టరే స్వయంగా ఇంకుడు గుంతను తవ్వారు. అదే స్ఫూర్తితో అందరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఈ దిశగా అధికారుల ప్రయత్నాలు జరుగుతాయా.. లేదా.. అనేది వేచిచూడాలి.
ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంది. అదనంగా 46 శాతం పడింది. కానీ.. గతేడాది కంటే 2 మీటర్ల భూగర్భ జలం తగ్గింది. యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలి. రైతులు ఉపాధిహామీ ద్వారా ఫాం పాండ్లను నిర్మించుకోవాలి. తద్వారా నీటిని పొదుపు చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే భూగర్భ జలం స్థిరంగా ఉంటుంది.
– రమేశ్, జిల్లా భూగర్భ జలశాఖాధికారి, భద్రాద్రి కొత్తగూడెం
భూమిలో జలం బాగా తగ్గింది. గతంలో మా బోరు రెండున్నర అంగుళాలు పోసేది. ఇప్పుడు అరంగుళం మందం నీరు వస్తున్నది. ఇలా పోస్తే పొలానికి నీరు సరిపోదు. వచ్చేనెలలో ఇంకా తగ్గిపోతుంది. ఇప్పటికే వరి పంట ఎండిపోతున్నది. రానున్న రోజులు రైతులకు గడ్డుకాలమే.
-నరకుల్ల అప్పాజీ, అయ్యన్నపాలెం, చండ్రుగొండ మండలం
కరెంటు సక్రమంగా ఉండడం లేదు. దీంతో పొలానికి సక్రమంగా తడి పెట్టలేకపోతున్నాం. బోరులో నీరు ఉన్నా కరెంటు లేకపోవడం మాలోంటి వాళ్లకి ఇబ్బందిగా ఉంది. భూగర్భ జలం ఈ ఏడాది తగ్గింది. ఎండాకాలం చెరువులు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. కనీసం కరెంటు సమస్య లేకుండా చూడాలి.
-కుంజా వీరాస్వామి, లింగగూడెం, గుండాల మండలం